Off The Record: రాజకీయాల్లో ఢీ అంటే ఢీ అని తలపడటం ఒక ఎత్తయితే…. ఎక్కువ మంది మాత్రం వ్యూహాత్మక ఎత్తుగడల్ని ఫాలో అవుతుంటారు. అందులో కూడా కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకునే సెక్షన్ కూడా ఒకటుంటుంది. వాళ్ళు మనవాళ్ళో పగవాళ్ళో తెలిసే లోపే… జరక్కూడని నష్టం జరిగిపోతుంది. కుదిరితే కుట్రలతో ప్రజాక్షేత్రంలో ఓడిస్తారు లేదంటే వెన్నుపోటు పొడిచి దెబ్బ తీస్తారు. ప్రస్తుతం ఇలాంటి రాజకీయాలకు కేరాఫ్‌గా మారుతోంది అనంతపురం జిల్లా. మరీ ముఖ్యంగా వైసీపీలో ఈ బెడద ఎక్కువగా ఉందట. ప్రస్తుత జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటున్నట్టు చెప్పుకుంటున్నారు. జిల్లా పార్టీలో కట్టప్పలు ఉన్నారంటూ ఆయన చేసిన తాజా కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. గత ఎన్నికల్లో ఓడిపోయాక గానీ… ఆయనకు మన వాడెవరో, పగ వాడెవరో తెలిసి రాలేదంటున్నారు. జిల్లాలో సీనియర్ లీడర్ అయిన అనంత వెంకట్రామిరెడ్డి నాలుగు సార్లు ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్‌లో ఉన్నారు, ఇప్పుడు వైసీపీలో చేస్తున్నారు.
ఇక 2024 ఎన్నికల్లో అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారాయన. గత అసెంబ్లీ ఎన్నికల్లో…. అనంతపురం అర్బన్ వైసీపీ టికెట్ చాలా మంది ఆశించారు. వీరిలో కొంత మంది అనంత వెంకట్రామిరెడ్డిని బహిరంగంగానే వ్యతిరేకించారు. మరి కొంతమంది మాత్రం ఆయన వెంట ఉంటూనే కనిపించకుండా గోతులు తవ్వేశారట. తమకు టికెట్ రాలేదన్న అక్కసుతో ఎలక్షమ్ టైంలో కొందరు అనంతకు గట్టి పోట్లే పొడిచారని నియోజకవర్గంలో బహిరంగంగానే మాట్లాడుకుంటారు. అయితే ఫలితాలు వచ్చిన దాదాపు 17 నెలల తర్వాత ఈ మ్యాటర్ అంతా దేనికంటే…ఆ కట్టప్పలెవరో అనంత వెంకటరామిరెడ్డికి తెలిసిపోయిందట. తన వెన్నంటే ఉండి టిడిపి నేతలకు సమాచారం అందిస్తున్న వాళ్ళు ఎవరో ఆయనకు క్లారిటీ వచ్చినట్టు తెలిసింది. ఎమ్మెల్యే దగ్గుపాటి ఇటీవల అనంత వెంకటరామిరెడ్డి మీద తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతపురంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన ఏకంగా 450 ఎకరాల ఆస్తి సంపాదించుకున్నారని ఆరోపించారు. కేవలం ఆరోపణలతో సరిపెట్టకుండా… ఇవిగో సాక్ష్యాలంటూ… సర్వే నెంబర్లతో సహా వివరాలు ప్రకటించారు ఎమ్మెల్యే. అనంత వెంకట్రామిరెడ్డికి రాజకీయం తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారంగాని, మరే ఇతర బిజినెస్‌లుగాని లేవుకదా..? మరి అన్ని ఆస్తులు ఆయనకు ఎలా వచ్చాయి? అంటే… రాజకీయాన్నే వ్యాపారంగా చేసుకుని సంపాదించారా అంటూ ప్రశ్నించారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్. త్వరలోనే అక్రమ ఆస్తుల వివరాలన్నిటినీ బయట పెడతానంటూ ఎమ్మెల్యే ప్రకటించం కలకలం రేపింది.
దాంతో… తన ఆస్తులపై వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది వెంకటరామిరెడ్డి. తన తండ్రి కాలం నుంచి తాము రాజకీయాల్లో ఉన్నామని, మేం ముగ్గురం అన్నదమ్ములం, అంతా కలిసే ఉంటున్నాం… పంచుకుంటే ఒక్కొక్కరికి కనీసం 30 ఎకరాలు కూడా రావంటూ వివరాలు వెల్లడించారు మాజీ ఎమ్మెల్యే. నాకు కూడా ఈ విషయంలో బాధగా ఉందని అన్నారాయన. మా తండ్రి కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నా మేము కనీసం 50 ఎకరాల భూమి కూడా సంపాదించుకోలేకపోవడం నిజంగా బాధేనని, నాకు రాజకీయాలు తప్ప వేరే ఏమీ తెలియవు. మీలాగా రియల్ ఎస్టేట్లు, అక్రమ దందాలు తెలియవని దగ్గుపాటికి కౌంటర్ ఇచ్చారాయన. సరే… ఆ రాజకీయ విమర్శలు, వివరణల సంగతి ఎలా ఉన్నా…. అసలు అనంత వెంకట్రామిరెడ్డికి సంబంధించిన విషయాలు బయటికి ఎలా తెలిశాయన్నది బేసిక్ క్వశ్చన్. మరీ ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్యేకు తెలిసే ఛాన్స్ అస్సలే లేదని, ఇదంతా నిన్న మొన్నటిదాకా తన వెంట నడిచిన వాళ్ళు చేసిన పనేనని అనుమానిస్తున్నారట ఆయన. వాళ్ళే టీడీపీ నాయకులకు టచ్‌లో ఉండి ఇక్కడి విషయాలు చేరవేస్తున్నారన్నది వెంకట్రామిరెడ్డి డౌట్. ఒకరిద్దరు నా దగ్గరే ఉంటూ… అవతల వాళ్ళకు అన్నీ చేరవేశారంటూ తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారాయన. ఇలాంటి కట్టప్పలకు తాను భయపడేది లేదని కూడా అన్నారు. రాజకీయ నాయకుల మీద ఆరోపణలు సాధారణమే అయినా…. అనంత వెంకట్రామిరెడ్డి మీద మాత్రం ఈ స్థాయి ఆరోపణలు గతంలో ఎప్పుడూ రాలేదు. ఇప్పుడిలా ప్రత్యర్ధులు సర్వే నంబర్స్‌తో సహా చెప్పారంటే…దాని వెనక మాత్రం చుట్టూ ఉన్నవాళ్ళ పాత్రే ఉందని అనుమానిస్తున్నారట. మరి కట్టప్పల్ని గుర్తించి ఇప్పటికే దూరం పెట్టారా? లేక అలా పెట్టడంలో కూడా సమస్యలు ఉన్నాయా అంటూ ఆరా తీస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు.