Off The Record: రెండు దశాబ్దాలపాటు వైద్యుడిగా సేవలందించి.. ప్రస్తుతం అలంపూర్ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ అబ్రహం.. 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. నియోజకవర్గాల పునర్విభజనలో అలంపూర్ సీటు SCలకు రిజర్వ్డ్ కావడంతో కాంగ్రెస్ నుంచి గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టారు. అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డితో ఉన్న పరిచయాలు ఎన్నికల్లో గెలిచేందుకు ఉపయోగపడ్డాయి. తర్వాత టీడీపీలోకి వెళ్లి పోటీ చేశారు. 2018 ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి పోటీ చేసి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. అలంపూర్‌లో ఈస్థాయిలో అబ్రహం పట్టుసాధించడానికి కర్నూలు కేంద్రంగా 22 ఏళ్లపాటు వైద్యుడిగా ఆయన అందించిన సేవలు కూడా ఓ కారణం. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో మరోసారి పోటీకి సిద్ధం అవుతున్నారు ఈ డాక్టర్ ఎమ్మెల్యే. ఇప్పటి వరకు అలంపూర్ అభివృద్ధికి చేసిన పనులు.. ఐదు లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా వేల ఎకరాలకు సాగునీరు అందించిన వైనాన్ని ప్రజలకు వివరిస్తున్నారు. వంద పడకల ఆస్పత్రితోపాటు డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటును ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారట అబ్రహం. ఎన్నికల్లో గెలుపుపై ఎమ్మెల్యే లెక్కలు ఎలా ఉన్నప్పటికీ.. పార్టీ అధిష్ఠానం కూడా పరిస్థితులను అబ్రహానికి మరింత అనుకూలంగా మార్చుతోంది. ఈ ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే చల్లా వెంకట్రామిరెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. వెంకట్రామిరెడ్డికి MLA కోటాలో MLC సీటు దాదాపుగా ఖరారైనట్టు చెబుతున్నారు.
Read Also: Off The Record: దుర్గగుడిలో చెల్లుబాటు కాని మంత్రి మాట..! మాజీ మంత్రిదే పెత్తనం..!
ఒక్క అలంపూరే కాదు.. పొరుగున ఏపీలో ఉన్న కర్నూలు జిల్లాతోనూ వెంకట్రామిరెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి. దాంతో జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టిన BRSకు వెంకట్రామిరెడ్డి వల్ల కలిసొచ్చే అంశాలపై చర్చ సాగుతోంది. వెంకట్రామిరెడ్డి చేరికతో అలంపూర్‌లో గులాబీ పార్టీ మరింత బలోపేతం అయ్యిందని.. అబ్రహం మరోసారి గెలిచేందుకు మార్గం సుగమం చేశారని లెక్కలేస్తున్నారు పార్టీ నాయకులు. అయితే అలంపూర్‌లో లేనిపోని వదంతులు ప్రచారం చేస్తున్నా.. వాటన్నింటికీ తన పనితోనే సమాధానం చెబుతానంటున్నారు అబ్రహం. వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు ప్రతి నియోజకవర్గంపై గులాబీ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ జాబితాలో అలంపూర్ కూడా ఉండటం.. ఇక్కడ ఎమ్మెల్యే అబ్రహానికి ఉన్న ప్లస్ పాయింట్లు.. రాజకీయ సమీకరణాలు.. ఇలా అన్నింటినీ బేరీజు వేసుకుని పావులు కదుపుతున్నారు. దాంతో అలంపూర్‌లో మరోసారి అబ్రహం గెలుపు ఖాయమనే లెక్కల్లో ఉన్నారు ఎమ్మెల్యే అనుచరులు.