Off the Record: కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, బీజేపీ నేతలు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పమవుతోంది. రెండు పార్టీల మధ్య అంతర్గత పోరు ఒక ఎత్తయితే.., నియోజకవర్గంలో ఆయా నేతల అనుచరుల ఆగడాలు మరో ఎత్తు అంటున్నారు స్థానికులు. అరాచకాలు ఆధారాలతో లహా బహిర్గతం కావడం, భూ కబ్జాలాంటి ఆరోపణలు, నెలవారీ మామూళ్ల కోసం బెదిరింపులు, రేషన్ బియ్యం మాఫియా లాంటి రకరకాల అవలక్షణాలతో ఆదోనిలో కూటమి ప్రభ మసకబారిపోతోందని మాట్లాడుకుంటున్నారు. తాజాగా ఎమ్మెల్యే సమక్షంలోనే దళిత సర్పంచ్‌కి అవమానం జరగడం, దళిత సంఘాల ఆందోళన చేయడం, ఆ తర్వాత ఎమ్మెల్యే క్షమాపణ చెప్పడం వంటి వరుస వివాదాలు ఆదోని కూటమిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయట. గత అసెంబ్లీ ఎన్నికల్లో… కూటమి అభ్యర్థిగా బీజేపీ తరపున విజయం సాధించారు పార్థసారధి. ఆ తర్వాతి నుంచి అసలు కథ మొదలైంది. ఆదోని సీటు ఆశించి భంగపడ్డ టీడీపీ నేత మీనాక్షినాయుడుకు, బీజేపీ ఎమ్మెల్యే పార్థసారథి కి మధ్య విబేధాలు రచ్చకెక్కాయి. ఇద్దరూ పరస్పరం బహిరంగంగా విమర్శించుకోవడంతో మొదలైన గొడవలు మొన్నటి దళిత సర్పంచ్ కు అవమానం జరిగిన ఘటనతో పీక్స్‌కు చేరినట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: Off The Record: కవిత ఫోన్ కూడా ట్యాపింగ్? అందుకే కామ్గా ఉన్నారా?
ఎమ్మెల్యేగా గెలిచిన పార్థసారథి టీడీపీ నేతలు, కార్యకర్తలకు పని చేయడం లేదని, వైసీపీ వర్గీయులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు మీనాక్షి నాయుడు. అందుకు ఎమ్మెల్యే కూడా ఘాటుగా రియాక్ట్ అవడంతో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఎమ్మెల్యే పార్థసారథి అనుచరులు ఇసుక లారీలు, ఫ్లైయాష్ లారీల యజమానులు బెదిరించిన ఘటనల ఆడియోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇసుక టిప్పర్లు, ట్రాక్టర్స్ నుంచి ట్రిప్పునకు ఇంత అని డిమాండ్ చేయడం, డ్రైవర్లను కొట్టి ఫోన్స్‌లాక్కోవడం లాంటివి బాగానే జరిగాయట. ఇక బీజేపీ నేత ఒకరు… ఏకంగా సబ్ రిజిస్ట్రార్ ను ఇంటికి పిలిపించి బెదిరించారన్న ఆరోపణలున్నాయి. నెలకు 8 లక్షలు ఇవ్వాలని ముందు డిమాండ్ చేసి.. ఆ తరువాత కాస్త తగ్గి రూ.4 లక్షల కోసం బెదిరించారట. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చారని, ఇపుడు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించినట్టు సమాచారం. అలాగే ఎమ్మెల్యే సన్నిహతులపై భూకబ్జా ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేకి అత్యంత సన్నిహితంగా ఉండే డాక్టర్ కిరణ్… తన తల్లి పేరుతో రూ.2 కోట్లు విలువ చేసే ఇతరుల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఏకంగా ఆధార్ కార్డ్ మార్ఫింగ్ చేశారట. ఆ దెబ్బకు ఎమ్మెల్యేనే నేరుగా రిజిస్ట్రార్ ఆఫీస్ కి వెళ్లి…ఎవరైనా డబ్బులు అడిగినా… తేడా పనులు చేయమన్నా నాకు ఫోన్ చేయమని చెప్పాల్సి వచ్చిందంటున్నారు. ఆదోనిలోని ఓ ప్రైవేటు గోడౌన్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 2 వేల బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించి గోడౌన్‌కి తాళం వేశారు అధికారులు.
Read Also: Kothwalguda Eco Park: త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి కొత్వాల్‌గూడ ఎకో పార్క్..
అయితే మాఫియా తెల్లారేసరికల్లా… ఆ గోడౌన్ లో కేవలం 109 బస్తాల రేషన్ బియ్యం మాత్రమే ఉంచి మిగతా మొత్తాన్ని దాటేసినట్టు చెప్పుకుంటున్నారు. ఈ వ్యవహారం వెనుక ఉన్నదంతా టీడీపీ నేత కుటుంబసభ్యులు, ఒక బీజేపీ నేత అన్నది లోకల్ టాక్. ఇక తాజాగా ఆదోని మండలం దనాపురంలో సర్పంచ్ ను ఎమ్మెల్యే పార్థసారథి వేదికపైకి ఆహ్వానిస్తుండగా టీడీపీ మహిళా నేత గుడిసె కృష్ణమ్మ జోక్యం చేసుకొని అతను ఎస్సీ అని చెప్పడం, దీంతో సర్పంచ్ ను కింద నిల్చోమని ఎమ్మెల్యే అనడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించి తనను దళితుడని అవమానించారంటూ… సర్పంచ్ చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దళిత సర్పంచ్ బీజేపీలో ఉన్నా… అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే మీద ఫిర్యాదు చేయడం ఆసక్తికరంగా మారింది. ఇద్దరూ క్షమాపణ చెప్పినా కేసు మాత్రం ఆగలేదు. ఇలా… మొత్తంగా ఆదోని నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు ఇటు టీడీపీ, అటు బీజేపీకి మచ్చతెచ్చేవిగానే ఉంటున్నాయని అంటున్నారు స్థానికులు. రెండు పార్టీల అధిష్టానాలు ఎలా సెట్ చేస్తాయో చూడాలి.