ప్రకాశం జిల్లా గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, 2009 ముందు వరకూ సివిల్ కాంట్రాక్టరుగా ఉన్న అన్నా రాంబాబు, ప్రజారాజ్యం పార్టీలో చేరి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావటంతో, కాంగ్రెస్ లో కొన్నాళ్లు కొనసాగారు. ఆ తర్వాత కాంగ్రెస్ ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరి, 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత అనూహ్య పరిణామాలతో, బహిరంగంగా ఆ పార్టీ కండువాను తీసి పక్కన పడేసి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో రాష్ర్టంలో వైఎస్ జగన్ తర్వాత అత్యధిక మెజారిటీతో వైసీపీ నుంచి గెలిచారు. గెలిచే వరకూ అంతా బాగానే ఉన్నా, ఆ తర్వాత కార్యకర్తలతో కొంత గ్యాప్ వచ్చిందట.ఆ గ్యాప్ అలాగే పెరుగుతూ నియోజకవర్గంలోని, ఆరు మండలాల్లో అధికార పార్టీలో రెండు గ్రూపులుగా కార్యకర్తలు విడిపోయారట. ఎమ్మెల్యే వైఖరి నచ్చక కొందరు గ్రామపార్టీ కార్యకర్తలు పార్టీని వీడుతున్నారట.
ఇటీవల గిద్దలూరు నియోజకవర్గ వైసీపీలో అసమ్మతి సెగలు మరింత ఎక్కువయ్యాయట. నెల రోజుల్లో రెండుసార్లు వైసీపీ అసంతృప్త నేతలు సమావేశమయ్యారట. ఎమ్మెల్యే అన్నా వ్యవహారంపై ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు సజ్జలతో పాటు వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డిలను కలిసి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారట. అప్పటికీ వారు స్పందించకపోతే, అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దమయ్యారట.
రెండో భేటికి భారీగా అసంతృప్త నేతలు?
అన్నా రాంబాబు మనస్తాపానికి గురయ్యారా?
నియోజకవర్గంలో బీటలు వారుతున్నాయని రాంబాబు భావనా?
పార్టీ అసంతృప్తులను ఎమ్మెల్యే ఎలా బుజ్జగిస్తారు?
అన్నాపై సజ్జల, బాలినేనికి ఎలాంటి ఫిర్యాదులు చేస్తారు?
ఈనెల 1వ తేదీన రాచర్ల మండల పరిధిలోని ఒక తోటలో ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్న పలువురు నేతలు తొలిసారి ప్రత్యేక సమావేశం నిర్వహించారట. గిద్దలూరు జడ్పీటీసీ బుడతా మధుసూదన్ యాదవ్‌తో పాటు గిద్దలూరు, రాచర్ల మండలాల్లోని కొందరు వైసీపీ కీలక నాయకులు ఆ సమావేశానికి హాజరయ్యారట. తాజాగా మరోసారి అసమ్మతి నేతలు భేటీ అయ్యారట. గిద్దలూరు, రాచర్ల మండలాలతోపాటు కొమరోలు మండలానికి చెందిన వైసీపీ నాయకులు, కిందిస్థాయి ప్రజా ప్రతినిధులు హాజరయ్యారట. తొలిసారి సమావేశం కంటే రెండవ సారి సమావేశానికి రెట్టింపు సంఖ్యలో అసంతృప్త నేతలు హాజరు కావటం చర్చనీయాంశంగా మారిందట.
రెండవసారి సమావేశంలో జడ్పీటీసీ బుడతా మధుసూదన్ యాదవ్, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు, గిద్దలూరు, రాచర్ల, కొమరోలు మండలాలకు చెందిన పలువురు ముఖ్యనేతలూ అటెండయ్యారు. గతంలో కూడా ఎమ్మెల్యే రాంబాబుకు వ్యతిరేకంగా కొందరు గుర్తుతెలియని వ్యక్తుల పేర్లతో పాంప్లెట్ల రూపంలో ప్రచారాలు చేశారట. ఒకటికి రెండు సార్లు అలా విడుదల చేయటంతో, ఎమ్మెల్యే అన్నా రాంబాబు మనస్తాపానికి గురయ్యారట. అయినప్పటికీ ఆయన ఆశించిన స్ధాయిలో ద్వితీయ శ్రేణి నేతలు ఆయనకు మద్దుతునివ్వలేదట. కనీసస్ధాయిలో ఖండన కూడా ఇవ్వలేదట… ఆ విషయం తనను ఎంతో బాధించిందని అప్పట్లో రాంబాబు స్వయంగా తన అనుచరుల వద్ద ప్రస్తావించారట కూడా. వీటికి తోడు సీఎం సామాజిక వర్గ నేతలకు, ఏ చిన్న అవసరం వచ్చినా, అటు మంత్రి బాలినేని దగ్గరకో, ఇటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దగ్గరకో వెళ్లి తమ పనులు చక్కబెట్టుకుంటున్నారు తప్ప, ఎమ్మెల్యే వద్దకు వెళ్లే పరిస్దితి లేదట.
మరోవైపు ఎమ్మెల్యే వైఖరి నచ్చకునో, ప్రభుత్వంపై అసమ్మతితోనో, తెలుగుదేశం పార్టీ వైపు వలసలు కూడా గణనీయంగా పెరుగుతూ వస్తున్నాయి. నియోజకవర్గంలో తన రాజకీయ భవితవ్యానికి బీటలు వారుతున్నాయని ఎమ్మెల్యే రాంబాబు అర్దం చేసుకున్నారా? లేదా రోజురోజుకు పెరుగుతున్న పార్టీ అసంతృప్తులను ఎమ్మెల్యే ఎలా బుజ్జగిస్తారు? పార్టీ పెద్దలు సజ్జల, బాలినేనిని కలవనున్న నాయకులు, అన్నాపై ఎలాంటి ఫిర్యాదులు చేస్తారు? అధిష్టానం వారిని ఏం మంత్రం వేసి శాంతింప జేస్తుంది? అన్నాతో కలిసి వారు నియోజకవర్గంలో కలసి అడుగులు ముందుకు వేసే పరిస్థితి వుందా? కాలమే సమాధానం చెప్పాలి.