Mahbubnagar TRS: ఖద్దర్ అయితే మాకేంటని.. అక్కడి అధికారులు ప్రజాప్రతినిధులను లెక్క చేయడం లేదా? ప్రతి విషయంలోనూ ఢీ అంటే ఢీ అంటున్నారా? గట్టిగా ప్రశ్నిస్తే.. మీ పదవీకాలం ఐదేళ్లే అని ఎందుకు దెప్పి పొడుస్తున్నారు? లీడర్స్‌తో ఆఫీసర్లు కోరి కయ్యం పెట్టుకుంటున్నారా? ఇంతకీ ఏంటా జిల్లా?
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు… ఎమ్మెల్యేలను లైట్ తీసుకుంటున్నారట. మీరు చెబితే మేం చేసేది ఏంటని కొందరు ఆఫీసర్లు ఎదురు తిరుగుతున్నట్టు సమాచారం. ఎమ్మెల్యేగా మీరు ఐదేళ్లు పదవిలో ఉండి వెళ్లిపోతారు. తర్వాత ఏదైనా ఇబ్బంది వస్తే మా పరిస్థితి ఏంటి? అని ప్రశ్నిస్తున్నారట. అయితే అధికారుల సహాయ నిరాకరణతో పనులుకాక.. ప్రజలకు జవాబు చెప్పలేక దిగులు చెందుతున్నారట ఎమ్మెల్యేలు. మొన్నటి వరకు మన ప్రభుత్వం.. మన అధికారులు అని ఎమ్మెల్యేలు.. అధికారులు ఫ్రెండ్లీగా సాగారు. ఉన్నట్టుండి సీన్ రివర్స్ అయ్యింది.
ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు ప్రస్తావించే సమస్యలను అధికారులు పెడచెవిన పెడుతున్నారట. నిధులున్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్నదే ప్రశ్న. ఒకటో రెండు అంశాల్లో అయితే ఓకే.. అన్నింటికీ ఇదే పరిస్థితి ఎదురు కావడంతో రెండు వ్యవస్థల మధ్య గ్యాప్ వస్తోందట. ఈ మధ్య కాలంలో జరుగుతున్న సమావేశాలు.. సమీక్షల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఓపెన్‌గానే అధికారులపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో ఫోన్ల ద్వారా మాట్లాడుకుని.. పరస్పర అవగాహనతో పనిచేసిన వాళ్లు సైతం ప్రస్తుతం శత్రుభావంతో చూసుకుంటున్నారు.
ఇటీవల కాలంలో నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు ఎమ్మెల్యేల. ప్రజల నుంచి వస్తున్న విజ్ఞప్తులను అధికారులకు చెప్పి పరిష్కరించాలని కోరుతున్నారు. కానీ.. ఆ సమస్యలు అలాగే ఉండిపోతున్నాయట. మరోసారి జనాల్లోకి వెళ్లితే సమాధానం చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారట ఎమ్మెల్యేలు. వచ్చే ఎన్నికల్లో ఇలాంటి సమస్యలు అసలుకే ఎసరు పెట్టేలా మారతాయని ఆందోళన చెందుతున్నారట. పంచాయతీరాజ్, విద్యుత్, ఇరిగేషన్, పౌరసరఫరాలు, మైనింగ్, వ్యవసాయశాఖ అధికారుల నుంచి చాలా ప్రతికూలత ఉందట. ఈ ప్రభుత్వ విభాగాలతో నిత్యం ప్రజాప్రతినిధులు టచ్‌లో ఉంటారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలు కూడా వీటిల్లోనే ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్య జరిగిన జడ్పీ సమావేశంలో వీటిపై అధికారులను గట్టిగానే నిలదీశారు ప్రజాప్రతినిధులు.
ఇసుక తరలింపు.. తవ్వకాలకు అనుమతులు ఇచ్చే విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా గొడవలు వస్తున్నాయట. విద్యుత్ శాఖలో పైసలిస్తేకానీ పనులు కావడం లేదట. వీటిపై ఎమ్మెల్యేలు ఇస్తున్న ఆదేశాలు రూల్స్‌కు విరుద్ధంగా ఉంటున్నాయనేది కొందరు ఆఫీసర్లు చెప్పేమాట. వింటే ఒక తంటా.. వినకపోతే మరో ఇబ్బంది అన్నట్టుగా ఉందట. జూరాలలో నిండుగా నీళ్లున్నా కోయిల్‌సాగర్‌కు ఎత్తిపోతల ద్వారా నీళ్లు పంపకపోవడంపై ప్రజాప్రతినిధులు ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ గొడవలు చూశాక.. కలిసిమెలిసి సాగిన అధికారులు.. ఎమ్మెల్యేలకు ఎక్కడ చెడింది అనేది పెద్ద ప్రశ్నగా మారింది. మరి.. ఎన్నికల వరకు ఇదే గ్యాప్ పాటిస్తారో.. లేక అసలుకే ఎసరు రాకుండా శాసనసభ్యులు జాగ్రత్త పడతారో చూడాలి.