దమ్ముంటే ఇప్పుడు ఎన్నికలు పెట్టండి.. మీ పెతాపమో.. మా పెతాపమో తేల్చుకుందాం అని సవాళ్లు విసిరిన టీడీపీకి..ఇప్పుడు కొత్త చిక్కొచ్చి పడిందా? స్థానిక సంస్థల ఎన్నికలు ఆ పార్టీకి అగ్నిపరీక్షగా మారబోతున్నాయా? తెలుగు తమ్ముళ్లు ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడ్డారా?
మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికల్లో శక్తిని చాటుకోక తప్పదా?
ఏపీలో వివిధ కారణాలతో మిగిలిపోయిన స్థానిక సంస్థలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడత ఎలక్షన్స్ జరిగినప్పుడు నామినేషన్ల దాఖలు, ఏకగ్రీవాల విషయంలో అధికారపార్టీ దౌర్జన్యాలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఎన్నికలను బహిష్కరించింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడా పరిస్థితి లేదు. ఈ దఫా ఎన్నికలు జరుగుతున్న వాటిల్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు 12 మున్సిపాలిటీలు, 11 జడ్పీటీసీలు, 85 ఎంపీటీసీలు, 533 వార్డులు ఉన్నాయి. 12 మున్సిపాలిటీలలో కుప్పం కూడా ఉంది. మధ్యలో సంప్రదాయం పేరుతో బద్వేల్ అసెంబ్లీ ఉపఎన్నిక నుంచి టీడీపీ తప్పుకొంది. ఇప్పుడు రాష్ట్రంలో అధికార వైసీపీతో ఢీ అంటే ఢీ అని తలపడుతుంది టీడీపీ. ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని.. ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని చెబుతున్న టీడీపీ తన శక్తిని చాటుకోక తప్పదు.
దమ్ముంటే ఎన్నికలు పెట్టాలని నిన్నమొన్నటి వరకు టీడీపీ సవాళ్లు..!
ఇప్పుడు జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిస్థాయిలో పట్టుబిగిస్తోంది అధికారపార్టీ. అయితే కొంతకాలంగా టీడీపీ చేస్తున్న కామెంట్సే ఇప్పుడు ఆ పార్టీకి ఇబ్బందిగా మారినట్టు సమాచారం. దమ్ముంటే అసెంబ్లీ ఎన్నికలు పెట్టాలని చంద్రబాబు సహా టీడీపీ నేతలు అధికారపార్టీని సవాల్ చేస్తున్నారు. ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందామని తొడలు కొడుతున్నారు కూడా. ఆ సవాళ్లకు టీడీపీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో వచ్చిందని లెక్కలేస్తున్నాయి పార్టీ శ్రేణులు.
కుప్పం మున్సిపాలిటీలో టీడీపీ రణతంత్రం ఎలా?
మిగిలిన స్థానిక సంస్థల్లో ఎన్నికలు ఎలా ఉన్నా.. కుప్పం మున్సిపాలిటీ మాత్రం ఈ దఫా ప్రత్యేకం. గడిచిన పంచాయతీ, పరిషత్ ఎన్నికల్లో నియోజకవర్గంలోని 90కిపైగా ఎంపీటీసీలు, పంచాయతీలను వైసీపీ కైవశం చేసుకుంది. ఆ ఎన్నికల్లో తాము పోటీ చేయలేదు కాబట్టి వారు గెలిచారని చెప్పినా.. ఇప్పుడు అలా చెప్పుకోవడానికి ఆస్కారం లేదు. కుప్పం మున్సిపాలిటీని టీడీపీ చేజిక్కించుకోకపోతే.. పార్టీ శ్రేణులు నైరాశ్యంలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. వారిలో ధైర్యం నింపడానికి.. టీడీపీ బలం తగ్గలేదని నిరూపించడానికి.. చంద్రబాబు అండ్ కో గట్టిగా పోరాటం చేయక తప్పదు.
బహిష్కరించే అవకాశం లేక కేడర్ లబోదిబో..!
ఈ ఎన్నికల్లో సత్తా చాటకపోతే వైసీపీ నుంచి వచ్చే కామెంట్లను భరించలేమన్నది టీడీపీ శ్రేణుల ఆందోళన. అందుకే చాలామంది నేతలు.. ఇప్పుడీ ఎన్నికలు ఎందుకొచ్చాయిరా దేవుడా అని తలపట్టుకుంటున్నారట. గతంలో మాదిరి ఈ ఎన్నికలను కూడా బహిష్కరించే అవకాశం లేక లబోదిబో మంటున్నట్టు టాక్. మరి.. ఈ మినీపోరులో టీడీపీ శ్రేణులు సత్తా చాటుతాయో లేదో చూడాలి.