లీడర్స్ ఫర్ సేల్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తున్న మాట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు నాయకులు అమ్ముడు పోయారనే ఆరోపణలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. ఎవరు బాగోతం ఏంటో తెలుసుకునేందుకు.. ఏకంగా లై డిటెక్టర్ పరీక్షలకు సవాళ్లు విసురుకుంటున్నారు. ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం.
కాంగ్రెస్, బీజేపీ మధ్య సోషల్ మీడియాలో వార్..!
ఎన్నికలంటేనే.. బోల్డంత డబ్బు ఖర్చుపెట్టాలి. ఓటర్లకు పంచడం ఎలా ఉన్నా.. ప్రత్యర్థులను దారిలోకి తెచ్చుకునేందుకు నోట్ల కట్టలతో కొడతారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునేలా ఇంకొందరు ప్రయత్నిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే జరిగిందని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీల మధ్య సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో విమర్శల యుద్ధం నడుస్తోంది.
ప్రలోభాలకు లొంగే నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారా?
టీఆర్ఎస్ అభ్యర్థి దండే విఠల్ కాకుండా 23 మంది నామినేషన్లు వేశారు. వారిలో 22 మంది నామినేషన్లు విత్‌డ్రా చేసుకోగా.. ఒక మహిళ వెనక్కి తగ్గలేదు. దాంతో ఇక్కడ పోలింగ్ అనివార్యమైంది. అయితే 22 మంది నామినేషన్ల విత్‌డ్రాలోనే భారీగా చేతులు మారాయని ఆరోపణలు జిల్లా రాజకీయాలను హీటెక్కిస్తున్నాయి. నామినేషన్ వేయాలంటే పది మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అభ్యర్థిని ప్రతిపాదించాలి. కాంగ్రెస్, బీజేపీ ఇతర పార్టీల నుంచి గెలిచినవాళ్లు 22 మందిలో కొందరికి సంతకాలు చేశారట. వాళ్లంతా పోటీ నుంచి విరమించుకోవడంతో అధికారపార్టీ ప్రలోభాలకు లొంగారనే ఆరోపణలు రాజకీయాల్లో చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కర్తకర్మ క్రియ కొంతమంది కీలక నాయకులే అని చెవులు కొరుక్కునే పరిస్థితి ఉంది.
లీడర్స్ ఫర్ సేల్‌పై పార్టీ పెద్దలకు ఫిర్యాదులు?
నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల ప్రతిపక్షపార్టీలకు చెందిన సీనియర్ నేతలపైనే సోషల్ మీడియాలో గురిపెడుతున్నారు. మీరు అమ్ముడు పోయారంటే.. మీరు అమ్ముడు పోయారని కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇదే ఛాన్స్ అనుకున్నారో ఏమో.. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిపై ఆయా పార్టీలలోని వ్యతిరేక వర్గాలు ఫిర్యాదుల పరంపర మొదలుపెట్టాయట. లీడర్స్ ఫర్ సేల్ అని తమ పార్టీ అధిష్ఠానాలకు విషయాన్ని చేరవేసినట్టు సమాచారం. ఫిర్యాదులు అందగానే పార్టీల పెద్దలు ఆరా తీస్తున్నట్టు చెబుతున్నారు. మొత్తానికి.. ఆరోపణల్లో నిజమెంతో ఏమో.. రెండు పార్టీలలోనూ సీక్రెట్ పోస్టుమార్టాలపై ఓ రేంజ్‌లో చర్చించుకుంటున్నాయి పార్టీ శ్రేణులు.
ఫిర్యాదులతో తమ రాజకీయ జీవితానికి ఇబ్బందులు వస్తాయని అనుకున్నారో ఏమో.. కొందరు నేతలు తాము క్లియర్ అని మీడియా ముందుకు వస్తున్నారు. తమ అనుచరులతో ప్రకటనలు ఇప్పిస్తున్నారట. మరి.. ఈ పొలిటికల్ రచ్చకు ముగింపు ఉంటుందో లేదో చూడాలి.