TTD జంబో జెట్ పాలకమండలి కోసం ప్రభుత్వం చేస్తున్న మరో ప్రయత్నం సక్సెస్ అవుతుందా? ఆర్డినెన్స్ వర్కవుట్ అయ్యేనా? కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకుంటారా? TTDపై తాజాగా జరుగుతున్న చర్చ ఏంటి?
సిఫారసులు పెరిగి 81 మందితో జంబో కమిటీ ఏర్పాటు..!
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో సభ్యత్వానికి ఇటీవలకాలంలో బాగా డిమాండ్ పెరిగింది. తినగ తినగ వేము తియ్యనుండు అన్నట్టుగా TTD బోర్డులోకి ఒక్కసారి అడుగుపెట్టిన వారు.. రెండుసార్లు కాదు.. మూడుసార్లు కాదు.. నాలుగోసారి కూడా కావాలని పట్టుబట్టి దక్కించుకుంటున్నారు. ఈ ఒత్తిళ్లు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద చిక్కులే తెచ్చిపెడుతున్నాయి. గతంలో 18 మంది సభ్యులుంటే.. బోర్డులో చోటు ఆశిస్తున్నవారి సంఖ్య అంతకు రెట్టింపు ఉండటంతో చట్ట సవరణ చేసి.. 25కు పెంచారు. నలుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులు.. 8 మంది ప్రత్యేక ఆహ్వానితులతో అది 37కు చేరుకుంది. ఈసారి ఏకంగా 81 మందితో జంబో పాలకమండలిని ఏర్పాటు చేసింది ప్రభుత్వం.
రెండు జీవోలను సస్పెండ్ చేసిన హైకోర్టు..!
1987 దేవాదాయ చట్టం ప్రకారం టీటీడీలో పాలకమండలి సభ్యుల సంఖ్య 29కి మించకూడదు. ఆరుగురితో మొదలైన పాలకమండలి ఇప్పుడు 29కి చేరింది. ఇక ఇతర సీఎంలు, కేంద్రమంత్రులు, కేంద్రంలోని పెద్దలు, మఠాధిపతులు, పీఠాధిపతుల సిఫారసులతో అది 81కి చేరింది. 25 మంది పాలకమండలి సభ్యులు, నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులు, తిరుపతి ఎమ్మెల్యే, బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌లు ఆహ్వానితులు కాగా.. మరో 51 మందిని ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో జీవోలు వచ్చాయి. ఈ చర్యను టీడీపీ, బీజేపీ నాయకులు కోర్టులో సవాల్ చేయడంతో ప్రత్యేక ఆహ్వానితులకు సంబంధించిన రెండు జీవోలను హైకోర్టు సస్పెండ్ చేసింది.
ప్రత్యేక ఆహ్వానితుల కోసం ఆర్డినెన్స్ తెస్తారా?
ఈ సమస్య నుంచి గట్టెక్కేందుకు ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. చట్ట సవరణ చేసి ప్రత్యేక ఆహ్వానితులకు లైన్ క్లియర్ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కేబినెట్ మీటింగ్‌లో ఈ అంశాన్ని చేర్చబోతున్నారు. ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి.. నవంబర్‌లో జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశంలో చట్ట సవరణ చేస్తారని సమాచారం. ఆ విధంగా సమస్యను పరిష్కరించే యోచనలో పెద్దలు ఉన్నారట. అయితే ఆర్డినెన్స్ జారీ చేసినా.. తిరిగి కోర్టు తలుపులు తడతామంటున్నారు పిటిషనర్లు. అందుకే ఈ అంశంపై చర్చ జరుగుతోంది. మరి.. ఆహ్వానితుల జాబితాలో ఉన్నవారి ఆశలు తీరతాయా? లేక అడియాసలేనా అన్నది మరికొన్ని రోజులు ఆగాల్సిందే.