ఆ జిల్లాలో సగంమంది ఎమ్మెల్యేలను సర్వే టెన్షన్ పెడుతోందా? పార్టీ చేపట్టిన వడపోత.. ఉక్కపోతగా మారి ఉక్కిరి బిక్కిరి అవుతోంది ఎవరు? సిట్టింగ్‌లు ఆందోళన చెందుతుంటే.. ఆశావహులు హుషారుగా ఉన్నారా? ఇంతకీ ఏంటా జిల్లా? లెట్స్ వాచ్..!
మేము సిట్టింగులం.. అధినేతకు అనుకూలంగా ఉన్నాం.. మాకెలాంటి ఢోకా లేదని ఇన్నాళ్లూ కాలం వెళ్లదీసిన MLAలకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొదవ లేదు. అలాంటి వారంతా ప్రస్తుతం సర్వే మాట చెప్పగానే ఉలిక్కి పడుతున్నారట. ఒక్కసారిగా మారిన రాజకీయంతో దిక్కుతోచని స్థితిలో పడినట్టు ప్రచారం జరుగుతోంది. సర్వే ఆధారంగానే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని ఆ మధ్య TRS ప్రకటించింది. అయితే ఆ సర్వే వడపోతల్లో నిలిచింది ఎవరు? జారిపోతోంది ఎవరు? అన్నదే ప్రస్తుతం గులాబీ శిబిరంలో ఉత్కంఠగా మారింది. ఉమ్మడి జిల్లాలోని మెజారిటీ స్థానాల్లో కొత్త వారికి టికెట్స్ ఇస్తారనే చర్చ జోరందుకుంది. దీంతో తమ గ్రాఫ్ ఎలా ఉంది? సర్వేలో నిలిచామా లేదా అని టీఆర్ఎస్ అధిష్ఠానానికి సన్నిహితంగా ఉండేవారి దగ్గర ఆరా తీస్తున్నారట ఎమ్మెల్యేలు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. 2018లో టీఆర్ఎస్ పదిచోట్ల గెలిచింది. భూపాలపల్లి, ములుగు కాంగ్రెస్‌కు వెళ్లాయి. భుపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి టీఆర్ఎస్‌లో చేరడంతో జిల్లాలో పార్టీ బలం 11కు చేరింది. టీఆర్ఎస్ నిర్వహిస్తున్న సర్వేలో ఈ 11 మంది ఎమ్మెల్యేలలో ఎంత మందికి పాస్ మార్కులు పడ్డాయి.. బోర్డర్‌లో ఉన్నదెవరు? ఫెయిల్ అయ్యింది ఎవరు? అని గులాబీ శ్రేణులు ఆరా తీస్తున్నాయి. అయితే ఐదుచోట్ల సిట్టింగ్‌ల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నట్టు సర్వేలో తేలిందట. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు ఎవరన్నది బయట పెట్టలేదు. దాంతో ఎవరికి వారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారట.
సర్వేలో ఏం గుర్తించారో ఏమో కానీ.. వరంగల్ తూర్పు.. మహబూబాబాద్, డోర్నకల్, స్టేషన్ ఘనపూర్, జనగామ, భూపాలపల్లి నియోజకవర్గాలపై ఎమ్మెల్యేల వైరి వర్గాలు యాక్టివ్ అయ్యాయి. ఒక రాయి వేస్తే పోలా అన్నట్టుగా అక్కడ టికెట్ ఆశిస్తున్న టీఆర్ఎస్ నేతలు జూలు విదిలిస్తున్నారు. అధిష్ఠానం దృష్టిలో పడేలా కార్యక్రమాలు నిర్వహిస్తూ.. టికెట్ వేటలో పడ్డారు నాయకులు. అయితే టీఆర్ఎస్‌లో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ.. ప్రజలకు అందుబాటులో ఉండని ఎమ్మెల్యేల చిట్టాను సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా మారిన వారిని ఈ దఫా పక్కన పెడతారని చర్చ జరుగుతోంది. గత ఎన్నికలకంటే ఈసారి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీల నుంచి గట్టి పోటీ తప్పదు. వాటిని కూడా ఎలక్షన్స్‌లో తట్టుకుని నిలబడి.. గట్టిగా పోరాటం చేసేవాళ్లు ఎవరనేదానిపై ఆరా తీస్తున్నారట. మొత్తానికి సర్వే పేరు చెబితేనే ఎమ్మెల్యేలు కిందామీదా పడుతున్నారు. మరి.. అధిష్ఠానం ఫ్రేమ్‌లో నిలిచేది ఎవరో ఏంటో కాలమే చెప్పాలి.