జనసేనలో కట్టప్పలు ఎవరు? పార్టీ నేతలు.. శ్రేణులపై ఎన్నడూ లేనంత ఆగ్రహాన్ని జనసేనాని ఎందుకు ప్రదర్శించారు? పవన్ కల్యాణ్ చెప్పినట్టు జనసేనలో కోవర్టులు ఉన్నారా? ఉంటే వారెవరు? ఏ అంశాన్ని గమనించి పవన్ ఆ అనుమానం వ్యక్తం చేశారు?
కొన్నేళ్లుగా రాజకీయాల్లో కోవర్టు ఆపరేషన్లు గురించి ప్రస్తావన వస్తూనే ఉంది. ఈ తరహా చర్చ ఏపీలో పెద్దగా లేదు. కానీ జనసేనలో కోవర్టుల గురించి చర్చ జరుగుతోంది. వివిధ వేదికలపై ప్రజారాజ్యం.. ఆ పార్టీ విలీనం గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు జనసేనాని పవన్ కల్యాణ్. నాడు కొందరు కోవర్టుల వల్లే కాంగ్రెస్‌లో పీఆర్పీని విలీనం చేయించారనేది పవన్ కామెంట్ల సారం. తాజాగా జరిగిన జనసేన పీఏసీ సమావేశంలో మరో కీలక అంశాన్ని కూడా పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. పార్టీలో ఉండేవారు ఉండొచ్చు.. పోయేవాళ్లు పోవచ్చు.. పార్టీలో ఉంటూ వెన్నుపోటు పొడవడం కరెక్ట్ కాదని నిర్మొహమాటంగా చెప్పేశారు జనసేనాని. ఇదే సమయంలో క్రమశిక్షణ కమిటీని పార్టీలో ఏర్పాటు చేస్తున్నామని.. తప్పు చేసిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేస్తామని స్పష్టంగా తెలిపారు.
పవన్ కల్యాణ్ ప్రకటన తర్వాత జనసేనలో ఎవరు కోవర్టులు అనేది ఆసక్తిగా మారింది. ఒకరిద్దరిలో కోవర్టు తరహా ఛాయలు కన్పిస్తున్నాయన్న పవన్ వ్యాఖ్యలు మరింత వేడి రాజేస్తున్నాయి. అసలు పార్టీలో ఏం జరుగుతోందనే చర్చ నడుస్తోంది. పార్టీ వర్గాల నుంచి ఆయనకు కొంత ఫీడ్ బ్యాక్ వచ్చిందని.. దానిని కంట్రోల్ చేయడానికే గతంలో ఎన్నడూ లేని విధంగా కటువుగా మాట్లాడారని అభిప్రాయ పడుతున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి… అన్ని స్థాయిల్లో కమిటీలు వేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు పవన్. అయితే ఆ కమిటీ ఇంఛార్జులను పని చేసుకోనివ్వకుండా చాలామంది స్థానిక నేతలు పదే పదే అడ్డుపడుతున్నారట. సోషల్ మీడియాలోనూ రకరకాల ప్రచారాలు పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్నారట. దాంతో కమిటీల్లోని వాళ్లు తాము పని చేయలేబోమని.. ఇలాగైతే కష్టమని నేరుగా పవన్ కల్యాణ్‌కు చెప్పేశారట. జనసేన కోసం పనిచేయలేని వారు.. పార్టీలో చేరి.. సొంతవాళ్లపైనే విమర్శలు చేస్తున్నట్టు గుర్తించారట. వారిని కట్టడి చేయడం స్థానిక నేతలకు సాధ్యం కావడం లేదట. ఇలా జనసేనలో చేరిన వారిలో అత్యధికమంది వైసీపీ నుంచే వచ్చారనేది పార్టీ వర్గాల వాదన. దాంతో వారిని ఉద్దేశించే పవన్ కల్యాణ్ కోవర్టు కామెంట్స్ చేశారని భావిస్తున్నారు.
పవన్ అలా అన్నారో లేదో.. కోవర్టులపై సోషల్ మీడియాలో కొత్త ప్రచారం మొదలైంది. జనసేనలో కీలకంగా ఉన్న నాదెండ్ల మనోహర్‌ను ఉద్దేశించే జనసేనాని ఆ కామెంట్స్ చేశారని వైరల్ చేస్తున్నారు. నాదెండ్ల వల్లే పార్టీ నుంచి కొందరు వెళ్లిపోయారని.. పార్టీలోకి కొత్తవాళ్లు రావడం లేదని చర్చకు పెట్టేశారట. దానిని దృష్టిలో పెట్టుకుని పవన్ కల్యాణ్ ఆ వ్యాఖ్యలు చేశారని విశ్లేషిస్తున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదన్నది జనసేన వర్గాల వాదన. వ్యక్తిగత లాభం కోసం పార్టీలో చేరిన వాళ్లు తనను నేరుగా అనలేక నాదెండ్లను బూచిగా చూపుతున్నారని పవన్ ఫీలవుతున్నారట. 2019 ఎన్నికల వరకు పార్టీలో క్రియాశీలకంగా ఉండి.. ఓటమి తర్వాత వెళ్లిపోయిన వారిని పక్కన పెడితే.. జనసేనను అంటిపెట్టుకుని ఉన్న కొద్దిమందిలో నాదెండ్ల ఒకరనే సదాభిప్రాయం పవన్‌కు ఉందట. లేకపోతే ఆయన్ని పక్కన ఎందుకు కూర్చోబెట్టుకుంటారనేది పార్టీ వర్గాల ప్రశ్న.
పవన్ వ్యాఖ్యల వెనక వాస్తవాలు ఎలా ఉన్నా.. పీఆర్పీ నేర్పిన అనుభవంతో జనసేనాని కోవర్టుల పేరు వినిపించగానే ఉలిక్కి పడుతున్నారనే చర్చ నడుస్తోంది. మరి.. అలాంటి వారిని గుర్తించి ఏరివేతలు మొదలు పెడతారో లేక..ఇంకేదైనా ప్రత్యామ్నాయం ఆలోచిస్తారో చూడాలి.