బెజవాడలో ఇటీవల మెగా అభిమానులు నిర్వహించిన సమావేశం ఇది. ఒకప్పుడు ఫ్యాన్స్ మీటింగ్ అంటే.. చిరంజీవి చేపట్టే సేవా కార్యక్రమాలు.. సినిమాల చుట్టూ చర్చ జరిగేది. విజయవాడ సమావేశం మాత్రం పూర్తిగా రాజకీయ అజెండా చుట్టూ తిరిగింది. జనసేనాని పవన్ కల్యాణ్ కేంద్రంగా జరిగిన ప్రసంగాలు.. ప్రస్తుతం పొలిటికల్ సర్కిళ్లలో చర్చగా మారాయి. పవన్ కల్యాణ్‌ను సీఎంగా చూడాలని.. అందుకోసం పనిచేయాలని మెగా అభిమానులు తేల్చేశారు. అయితే ఇది వాళ్లకు వాళ్లుగా చేసిన కామెంటా లేక ఎవరైనా అనిపించారా అన్నది ఆసక్తిగా రేపుతోంది.
పూర్తిస్తాయిలో జనసేన పొలిటికల్ కార్యక్రమాలు మొదలుపెట్టిన తర్వాత మెగా ఫ్యాన్స్ తొలిసారిగా ఆయన్ను సీఎం చేయడమే లక్ష్యం అని ప్రకటించారు. పవన్ కల్యాణే సీఎం అని గట్టిగా నినదించారు. 2019 ఎన్నికల్లో చేదు ఫలితాలు రావడంతో డీలా పడింది కేడర్. మెగా ఫ్యాన్స్ వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే రెడీ అవుతున్నారు. అయితే ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారడంతో జనసేనాని స్వరంలోనూ కొంత మార్పు వచ్చింది. బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన.. తాజా పొలిటికల్ డెవలప్‌మెంట్స్‌పై వైఖరి మార్చుకున్నట్టు పవన్ కామెంట్స్ ద్వారా తెలుస్తోంది. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పవన్ పావులు కదుపుతున్నట్టు అర్థం అవుతోంది. జనసేన ఆవిర్భావ సభలో ఆ మేరకు క్లారిటీ ఇచ్చేశారు పవన్. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చనివ్వబోనని.. ఈ విషయంలో బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నట్టు ఆయన చెప్పారు. ఇంకోవైపు జనసేనతో పొత్తుకోసం టీడీపీ ఆశగా ఎదురు చూస్తోంది. రెండు పార్టీల మధ్య మాటలు కలుస్తున్నాయి కానీ ఇంకా చేతులు కలిసేల అడుగులు పడలేదు.
ఆ మధ్య తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించిన చంద్రబాబు టీడీపీ త్యాగాలకు సిద్ధంగా ఉందని చెప్పారు. సమాజం కోసం అంతా కలవాల్సి ఉందని చెప్పుకొచ్చారు. దీంతో త్యాగాలకు సిద్ధం అంటే ఏంటో స్పష్టం చేయకున్నా.. రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. కానీ రెండు పక్షాల నుంచి ఆ కామెంట్స్‌పై స్పష్టత రాలేదు. టీడీపీ, జనసేన కలవకుండా వైసీపీ కూడా పొలిటికల్ బ్యాటింగ్ మొదలు పెట్టింది. అవకాశం చిక్కితే టీడీపీ కంటే జనసేననే ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు వైసీపీ నేతలు. టీడీపీ, జనసేన పొత్తు కుదరకుండా చేయడం.. లేదంటే ఒకవేళ కలిసినా ఆ పొత్తు పండకుండా వైసీపీ చాలా ఎత్తుగడలు వేస్తోంది. అసలు పొత్తంటూ కుదిరితే దానికి ఎలాంటి షరతులు ఉంటాయో ఎవరికీ తెలియదు. సీనియర్‌గా చంద్రబాబే సీఎం అభ్యర్థి అనేది టీడీపీ శ్రేణులు సహజంగానే భావిస్తాయి. మరి పవన్ సంగతి ఏంటన్నది పొత్తుల చర్చలు మొదలైతేకానీ తెలియదు. కానీ.. మెగా ఫ్యాన్స్ మాత్రం పవన్ సీఎం అంటూ నినాదాలు మొదలుపెట్టేశారు. ఇది టీడీపీకి సిగ్నల్ ఇవ్వడానికేనా? అనే చర్చ ఉంది. అయితే పవన్ కల్యాణ్‌ను సీఎంగా చూడాలని అభిమానులు చెప్పడం వెనక ఎవరైనా ఉన్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
విజయవాడలో మెగా ఫ్యాన్స్ వ్యక్తం చేసిన అభిప్రాయాలపై జనసేన కానీ.. జనసేనాని పవన్ కల్యాణ్ కానీ స్పందించలేదు. ఈ విషయంలో పవన్ కల్యాణ్‌ది మౌనమా? వ్యూహమా అన్నది అంతుచిక్కడం లేదు. ఒకవేళ పొత్తులు పట్టాలెక్కాక పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. కొత్త పొత్తుల దిశగా బీజేపీని పవన్ కల్యాణ్ ఒప్పిస్తారా.. లేక కమలనాధులు నొప్పించారని బయటకొచ్చేస్తారో స్పష్టత లేదు. మరి.. అభిమానుల మాటల వెనక కోరస్ ఎవరో.. ఏంటో కాలమే చెప్పాలి.