మంత్రి అంటే.. ఆయన శాఖకు సంబంధించిన అన్ని విషయాలపై అవగాహన ఉంటుందని అనుకుంటాం. బాధ్యతలు చేపట్టిన కొత్తలో తెలియకపోయినా.. తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు కొందరు. మరి.. ఆ ప్రయత్నం చేయలేదో ఏమో.. సీఎం కేసీఆర్ వేసిన ప్రశ్నకు గుడ్లు తేలేశారట మంత్రి పువ్వాడ అజయ్. ఆ సందర్భంగా పేలిన డైలాగులపైనే ఇప్పుడు చర్చ.
ఆర్టీసీ బస్సుల లెక్కలు అడిగితే బిక్కముఖం వేసిన మంత్రి అజయ్?
టీఆర్‌ఎస్ ప్లీనరీ.. తెలంగాణ విజయ గర్జన సభపై మాట్లాడేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆ భేటీలో విజయ గర్జన సభకు జనాన్ని ఎలా తరలించాలన్న అంశం ప్రస్తావనకు వచ్చింది. వరంగల్ సభా ప్రాంగణానికి ఆర్టీసీ బస్సుల్లో జనాలను తరలించాలని నాయకులకు సూచించారు కేసీఆర్. ఆ క్రమంలోనే ఆర్టీసీ బస్సులు ఎన్ని ఉన్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ను కేసీఆర్ అడిగినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి నుంచి ఆ ప్రశ్న ఊహించని మంత్రి ఉలిక్కి పడ్డారట. బిక్కముఖం వేసి అటూ ఇటూ చూశారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఆర్టీసీ అధికారులకు ఫోన్‌చేసినా వివరాలు రాలేదట..!
పరిస్థితి తేడా కొడుతుందని ఆందోళన చెందిన మంత్రి పువ్వాడ అజేయ్ వెంటనే.. సమావేశం నుంచి బయటకు వచ్చి ఆర్టీసీ అధికారులకు ఫోన్ చేశారట. TSRTCలో ఎన్ని బస్సులు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేసినట్టు సమాచారం. పాపం.. మంత్రి ఎంత ప్రయత్నించినా అటు నుంచి కూడా సరైన లెక్కలు రాలేదట. ఈలోపే భద్రతా సిబ్బంది పరుగు పరుగున వచ్చి.. సీఎం కేసీఆర్ పిలుస్తున్నారని మంత్రి అజేయ్‌కి చెప్పి లోపలకి తీసుకెళ్లారట. ఇంకేముందీ మంత్రిగారి ముఖంలో నెత్తురు చుక్క ఉంటే ఒట్టు. చల్లాగాలిలోనూ చెమలు పట్టాయట. ఒక్కటే టెన్షన్. భయపడుతూనే లోపలికి వెళ్లారట మంత్రి అజేయ్.
బస్సుల లెక్క అడిగితే అటే పోయినావ్ అని నిలదీసిన సీఎం కేసీఆర్?
డోర్ తీసి లోపల అడుగుపెట్టగానే .. బస్సుల లెక్క అడిగితే అటే పోయినావ్ అని సీఎం కేసీఆర్ సూటిగా సుత్తిలేకుండా నిలదీయడంతో మంత్రిగారికి ఫీజులు ఎగిరిపోయాయట. అసలే మంత్రిగారి దగ్గర బస్సుల లెక్కలు లేవు. అధికారులకు ఫోన్ చేసినా సరైన సమాచారం రాలేదు. దీంతో ముఖ్యమంత్రి అడిగిన ప్రశ్నలకు జావాబు చెప్పలేకపోయినట్టు అజయ్ గురించి కథలు కథలుగా మాట్లాడుకుంటున్నాయి పార్టీ శ్రేణులు.
రవాణా మంత్రివి.. బస్సుల లెక్క తెలియదా అని కేటీఆర్ నిలదీత?
సమావేశం ముగిసిన తర్వాత టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ మధ్య మళ్లీ బస్సుల సంఖ్య ప్రస్తావన వచ్చిందట. రవాణా మంత్రిగా ఉన్నావ్.. ఆర్టీసీ బస్సుల సంఖ్య కూడా తెలియదా అని కేటీఆర్ నిలదీసినట్టు సమాచారం. సీఎం కేసీఆర్ దగ్గర పిన్‌డ్రాప్ సైలెన్స్ పాటించిన అజయ్.. కేటీఆర్ దగ్గర మాత్రం నోరు తెరిచారట. నేను రవాణా మంత్రిని.. ఆర్టీసీ మంత్రిని కాదని బదులిచ్చారట. ఈ ఘటన ఆ నోటా ఈ నోటా అధికారపార్టీ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయింది.
అలాంటిది ఏదీ లేదని కేటీఆర్ ముక్తాయింపు..!
కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ చేసిన సమయంలో మంత్రి పువ్వాడ అజయ్ కూడా వచ్చారు. అప్పటికే సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతున్న అంశంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు కేటీఆర్. మంత్రి అజయ్ మీద తాను ఏదో సెటైర్లు వేసినట్టు.. సీఎం కేసీఆర్ ఆయన్ని ఏదో అన్నట్టు వార్తొస్తున్నాయి. అలాంటిది ఏమీ లేదు అని కేటీఆర్ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో మీడియా ప్రతినిధుల దృష్టి అజయ్‌పై పడటంతో.. ఆయనేమో అటూ ఇటూ చూస్తూ ఉండిపోయారు. మరి.. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు ఇప్పటికైనా TSRTCలో ఎన్ని బస్సులు ఉన్నాయో తెలుసుకున్నారో లేదో…!