పసుపు కండువా నీడలోనే నేతలు ఉమ్మడి మహబూబ్‍నగర్ జిల్లాలో తెలుగుదేశంపార్టీలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన నేతలు ప్రస్తుతం ముగ్గురు నలుగురే ఉన్నారు. వారిలో ఒకరు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు. మిగతా వాళ్లు మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి.. కొత్తకోట దయాకర్‌రెడ్డి దంపతులు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన వారంతా వివిధ పార్టీల్లోకి వెళ్లిపోయారు. వీళ్లు మాత్రం పసుపు కండువా నీడలోనే కాలం వెళ్లదీస్తున్నారు. బక్కని నర్సింహులు టీ టీడీపీ అధ్యక్షుడిగా ఉండటంతో.. ఆయన్ని మినహాయిస్తే మిగతా ముగ్గురు పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో రాజకీయం వాడీవేడీగా ఉండటంతో ప్రస్తుతం చర్చ వీరిపై మళ్లింది. ఆరోగ్య కారణాలతో రావుల యాక్టివ్‌గా లేరు. కొత్తకోట దంపతులు మాత్రం ఒక జాతీయ పార్టీలో చేరతారని కొన్నాళ్లుగా చర్చ నడుస్తోంది.
కాంగ్రెస్ కండువా కప్పుకొంటారో.. బీజేపీ పంచన చేరతారో పాలమూరు టీడీపీ నేతలు స్పష్టత ఇవ్వడం లేదు. దయాకర్‌రెడ్డికి మాత్రం టీఆర్‌ఎస్‌వైపు మనసు లాగుతున్నట్టు సమాచారం. కానీ.. కొత్తకోట దంపతుల నియోజకవర్గాలైన మక్తల్, దేవరకద్రలో టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిని కాదని ఈ దంపతులకు టీఆర్ఎస్ ఛాన్స్ ఇవ్వకపోవచ్చని అనుచరులు లెక్కలేస్తున్నారట. అందుకే కాంగ్రెస్, బీజేపీలను ఒక ఆప్షన్‌గా పెట్టుకున్నారని చెబుతున్నారు. పైగా వచ్చే ఎన్నికలు జిల్లాలో మిగిలిన టీడీపీ నేతలకు అగ్ని పరీక్షే. సరైన దిశగా అడుగులు వేయకపోతే రాజకీయంగా వారి భవిష్యత్ ఇబ్బందుల్లో పడ్డట్టే. ఆ విషయం తెలిసినా మౌనంగా ఉండిపోతున్నారు నాయకులు.
అనుచరులు ఒత్తిడి తెస్తున్నా.. అదే పనిగా ప్రశ్నిస్తున్నా.. స్పష్టత ఇవ్వడం లేదు టీడీపీ నేతలు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని ఆలోచిస్తున్నారో లేక.. చేరాలని అనుకుంటున్న పార్టీల్లో సీట్లపై స్పష్టత లేక వేచి చూస్తున్నారో బయటపెట్టడం లేదు. కొత్తకోట దంపతులను చేర్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. కాకపోతే వారు అడిగే రెండు సీట్ల విషయంలోనే ఆ పార్టీలు వెనక్కి తగ్గుతున్నాయట. అందుకే రాజకీయంగా ముందడుగు పడటం లేదని సమాచారం.
ఒక తరం మారిపోయిందని అనుచరుల హెచ్చరిక తమ నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటి రాజకీయ పరిస్థితులే ఇప్పటికే కొనసాగుతున్నాయనే లెక్కలను తప్పుపడుతున్నారట అనుచరులు. మారిన రాజకీయ పరిణామాలతో ఒక తరం మారిపోయిందనే అంశాన్ని విస్మరించొద్దని హెచ్చరిస్తున్నారట. ఈ సత్యాన్ని గుర్తించి నిర్ణయం తీసుకుంటే పొలిటికల్ కెరీర్ ట్రాక్‌లో పడుతుందని.. లేకపోతే ఇక్కడితే ఫుల్‌స్టాప్ పడిపోతుందని హితవు పలుకుతున్నారట. మక్తల్, దేవరకద్రలో ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఇక రావుల మనసు మార్చుకుంటారో లేదో అనుచరులకు తెలియడం లేదట. ఇక బక్కని పరిస్థితి మరో ఎల్ రమణలా అవుతుందా లేక టీ టీడీపీలో ఏక్ నిరంజన్‌గా మిగిలిపోతారో చూడాలి.