అక్కడ కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అత్తా అల్లుళ్ల మధ్య వార్ రాజుకుంది. పంతం నెగ్గించుకునేందుకు ఒకరు.. పట్టు సడలకుండా ఇంకొకరు పొలిటికల్ పన్నాగాలు పన్నుతున్నారు. ఎవరు వాళ్లు? ఏంటా రాజకీయ యుద్ధం?
గద్వాలలో డీకే అరుణ వర్సెస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి..!
నడిగడ్డగా పిలిచే గద్వాల రాజకీయం ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. అది రాష్ట్ర రాజకీయమైనా.. స్థానిక సమస్య అయినా నేతల మధ్య మాటల తూటాలు పేలుతాయి. అలాంటిది గద్వాల కొంతకాలంగా పొలిటికల్‌గా సైలెంట్. రాజకీయ యుద్ధ వాతావరణం చల్లబడింది అని అనుకుంటున్న తరుణంలో నర్సింగ్ కాలేజీ భూముల రగడ సెగలు రేపుతోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మధ్య పొలిటికల్ వార్‌గా మారింది. వరసకు ఇద్దరూ అత్తా అల్లుళ్లు అవుతారు. గద్వాలపై పట్టు నిలుపుకొనే క్రమంలో వీరి మధ్య రాజకీయ విమర్శలు పదునుగానే ఉంటున్నాయి. నర్సింగ్ కాలేజీ భూముల వివాదం ప్రస్తుతం బర్నింగ్ టాపికైంది.
1160 మందికి 80 గజాల చొప్పున పంపిణీ..!
2012లో డీకే అరుణ మంత్రిగా ఉన్న సమయంలో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ కోసం సాంఘీక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో దౌదర్పల్లి దర్గా దగ్గర 79 ఎకరాలు సేకరించారు. 2 వేల 4 వందల మంది దరఖాస్తు చేసుకోగా.. మొదటి విడతలో ఒక పదకొండు వందల 60 మందికి 38 ఎకరాల్లో 80 గజాల చొప్పున పంపిణీ చేశారు. 2013లోనే పట్టాలు అందజేశారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకావడం.. టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఇళ్ల పట్టాల పంపిణీకి బ్రేక్ పడింది. ఇళ్ల స్థలాల కేటాయింపు స్కీమ్‌ను తొలగించిన టీఆర్ఎస్ సర్కార్.. డబుల్ బెడ్రూమ్ల పథకాన్ని తీసుకొచ్చింది.
లబ్ధిదారులు నిర్మాణాలు చేపట్టకపోవడంతో వెనక్కి తీసుకున్న ప్రభుత్వం..!
79 ఎకరాల్లో మిగిలిన స్థలంలో దాదాపు 14వందల డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. అప్పటికే ఇళ్ల పట్టాలు పొందిన 1160 మంది అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. దాంతో ఆ స్థలాన్ని వెనక్కి తీసుకున్న ప్రభుత్వం.. ఆ ల్యాండ్‌ను నర్సింగ్ కాలేజీతోపాటు 300 పడకల ఆస్పత్రికి కేటాయించింది. అంతే పట్టాలు పొందిన వాళ్లు రోడ్డెక్కారు. వారికి బీజేపీ నేత డీకే అరుణ బాసటగా నిలిచారు. రోజులు గడిచే కొద్దీ సమస్య రాజకీయ రంగు పులుముకుని రసవత్తరంగా మారుతోంది.
నర్సింగ్ కాలేజీ.. ఆస్పత్రి నిర్మాణానికే ఎమ్మెల్యే మొగ్గు..!
బాధితుల తరఫున రోడ్డెక్కుతున్న డీకే అరుణ..!
స్థానికంగానే మెరుగైన వైద్యం అందజేయాలని ఆస్పత్రి కడుతుంటే.. రాజకీయం చేయడం ఏంటన్నది ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ప్రశ్న. పట్టాలు పొందిన లబ్ధిదారులకు మరిన్ని డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇస్తామని ఆయన చెబుతున్నారు. ఈ విషయంలో ఎవరి వాదన వారిదే. అధికారం చేతిలో ఉండటంతో ఆ స్థలం విషయంలో ఎమ్మెల్యే ముందుకెళ్తుంటే.. ఆందోళన చేస్తున్న బాధితుల పక్షాన డీకే అరుణ రోడ్డెక్కుతున్నారు. రాజకీయ లబ్ధి దిశగా ఇద్దరూ అడుగులు వేస్తుండటంతో సమస్య అనేక మలుపులు తిరుగుతోంది. మరి.. ఈ ఆధిపత్యపోరులో ఎవరు పైచెయ్యి సాధిస్తారో చూడాలి.