తెలంగాణ రాజకీయాలు హీట్ మీద ఉన్నాయి. ఎన్నికలకు గడువు చాలా ఉన్నా.. పార్టీలు మాత్రం ఎవరి వ్యూహానికి వాళ్లు పదును పెడుతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఒక స్ట్రాటజీని అందజేశారట పార్టీ వ్యూహకర్త సునీల్. ఆ వ్యూహంలో భాగంగా పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్‌లు రహస్యంగా భేటీ అయ్యారట. ఈ సమావేశం గురించి అటు కాంగ్రెస్ నాయకులకు.. ఇటు TJS ప్రతినిధులకు కూడా తెలియదట. దాంతో రేవంత్, ప్రొఫెసర్ ఇద్దరూ ఎందుకు రహస్యంగా సమావేశం అయ్యారు? భేటీ అజెండా ఏంటి? ఏం చేయబోతున్నారు అని.. ఈ సీక్రెట్ మీటింగ్ గురించి తెలిసినప్పటి నుంచి గాంధీభవన్ వర్గాల్లో ఒకటే చెవులు కొరుకుడు.
కాంగ్రెస్.. TJSలు 2018 ఎన్నికలలో కలిసి పోటీ చేశాయి. అప్పట్లో పొత్తుల పేరుతో కాంగ్రెస్ ఇబ్బంది పెట్టిందనే అభిప్రాయంతో ఉన్నాయి CPI, TJSలు. నాటి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డిపై రెండు పార్టీలు బాహాటంగానే విమర్శలు చేశాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వామపక్ష పార్టీలు సైలెంట్‌గానే ఉన్నా.. కోదండరాం చుట్టూ కొన్ని పార్టీలు ప్రయోగాలు చేసే పనిలో పడ్డాయి. ఆ మధ్య ఆప్‌లో TJS విలీనం అని ప్రచారం సాగింది. ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్నా.. రెండుచోట్ల TJS అభ్యర్థులను ప్రకటించారు కోదండరామ్. ఇదే టైమ్‌లో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, కోదండరామ్‌లు రహస్యంగా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆ మధ్య గాంధీభవన్‌లో రాహుల్ గాంధీ పర్యటనపై సన్నాహక సమావేశం ముగించుకుని హడావిడిగా వెళ్లిపోయారు రేవంత్. అప్పుడు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ హైదరాబాద్‌లోనే ఉన్నారు. రేవంత్, PKలు భేటీ అయ్యారని అనుకున్నారు. రేవంత్ హడావిడిగా వెళ్లడం చూసిన వాళ్లంతా దానికే ఫిక్స్ అయ్యారు. కానీ.. రేవంత్ వెళ్లింది ప్రశాంత్ కిశోర్ దగ్గరికి కాదట. TJS చీఫ్ ప్రొఫెసర్ కోదండరామ్ దగ్గరికట. ఇద్దరూ సీక్రెట్‌గా చర్చలు జరిపినట్టు సమాచారం. ఆ భేటీ వివరాలు బయటకు పొక్కకుండా చాలా జాగ్రత్త పడ్డారట.
కోదండరామ్‌తో కలిసి పనిచేయాలని రేవంత్ భావిస్తున్నారా? లేక రాహుల్ గాంధీ సభకు కోదండరామ్‌ను ఆహ్వానించారా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. TJS విలీనంపై చర్చ జోరందుకున్న తరుణంలో కాంగ్రెస్‌లో పార్టీని కలిపేసే దిశగా చర్చలు సాగాయా అనే సందేహం కూడా ఉందట. కాంగ్రెస్‌పట్ల కోదండరామ్ కొంత సానుకూలంగానే ఉన్నట్టు చెబుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పాత్ర తెలిసిన ఆయన.. హస్తంతో కలిసి సాగడానికి పెద్దగా సమస్య ఉండదని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కూటమిలో టీడీపీలో కూడా ఉండటం ప్రొఫెసర్ కోదండరామ్‌కు రుచించలేదని చెబుతారు. కానీ.. పొత్తు ధర్మంలో భాగంగా మౌనంగా ఉన్నారని టాక్. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలను అధ్యయనం చేసిన కోదండరామ్‌ను కాంగ్రెస్ దగ్గరకు తీసుకునే ఆలోచన ఉన్నట్టు చర్చ జరుగుతోంది. మరి.. రేవంత్, కోదండరామ్ రహస్య భేటీ అజెండా ఏంటో.. కాలమే చెప్పాలి.