ఖమ్మంజిల్లా టీఆర్ఎస్‌లో క్రాస్ ఓటింగ్ ప్రకంపనలు కొనసాగుతున్నాయా? ఈ ఎపిసోడ్ వెనక ఉన్నదెవరు? వారిని పార్టీ గుర్తించిందా? చర్యలు తీసుకుంటుందా? ఇంతలోనే జిల్లా నాయకులు ఒకరిపై ఒకరు ఎందుకు బురద జల్లుకుంటున్నారు?
ఖమ్మంలో క్రాస్ ఓటింగ్‌ను ప్రోత్సహించిందెవరు?
పోలింగ్ జరిగిన ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచినా.. చర్చ మాత్రం క్రాస్ ఓటింగ్‌పైనే కొనసాగుతోంది. పోలింగ్ జరిగిన జిల్లా రాజకీయాల్లో ఈ అంశంపైనే చర్చ ఆసక్తిగా సాగుతోంది. ఖమ్మం జిల్లా ఫలితాలు అధికారపార్టీలో అలజడి రేపుతున్నాయి. ఈ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థికి.. ఆ పార్టీకి ఉన్న ఓటర్ల సంఖ్యాబలం కంటే 140 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. టీఆర్ఎస్‌కు చెందని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే కాంగ్రెస్‌కు ఓటేసినట్టు తేలిపోయింది. అయితే ఏ నియోజకవర్గానికి చెందిన వాళ్లు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు? ఎవరి అనుచరులు పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించారు? అనే అంశాలు ఇంకా తేలలేదు. సమస్య తీవ్రతను గుర్తించాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది.
టీఆర్ఎస్ మీటింగ్‌పై ఖమ్మం గులాబీ నేతల్లో గుబులు..!
ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్‌లో ఆధిపత్యపోరు ఉంది. అక్కడ గ్రూపు తగాదాలు కొత్త కాదు. ఆ జిల్లాలో ముఖ్య నేతలు అవకాశం వచ్చినప్పుడల్లా సొంత పార్టీలోని ప్రత్యర్థులను రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా ఈ క్రాస్ ఓటింగ్‌పై టీఆర్ఎస్ సమీక్షకు సిద్ధమవుతున్న సమయంలో.. జిల్లాలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో జరిగే టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో ఖమ్మం క్రాస్ ఓటింగ్‌పై గులాబీ బాస్ మాట్లాడతారని అనుకుంటున్నారట. ఈ విషయం తెలిసినప్పటి నుంచి జిల్లా టీఆర్ఎస్ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయట.
టీఆర్ఎస్‌లోని ప్రత్యర్థుల పేర్లు ప్రస్తావిస్తున్నారా?
క్రాస్ ఓటింగ్ సూత్రధారులపై చర్యలు ఉంటాయా?
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ తర్వాత ఉమ్మడి జిల్లాలో అసలు సిసలు రాజకీయం మొదలైందనే ప్రచారం జరుగుతోంది. ఈ అంశాన్ని అవకాశంగా తీసుకుని సొంత పార్టీలోని రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయాలనే ఎత్తుగడలు వేస్తున్నారట గులాబీ నేతలు. క్రాస్ ఓటింగ్ గురించి ఎవరు ప్రస్తావించినా.. తమ రాజకీయ ప్రత్యర్ధుల పేర్లు ప్రస్తావిస్తున్నారట. ఎదుటివారు విశ్వేసించేలా మాటలు కలిపేస్తున్నారట. ఈ విషయంలో ఎవరి విశ్లేషణలు వారివే. సోషల్ మీడియాలోనూ కొందరిని టార్గెట్ చేస్తూ బురద జల్లుడు మొదలైంది. వాటిపై చర్చ నడుస్తుండగానే.. ఇప్పుడు తెలంగాణ భవన్‌లో నిర్వహించే సమావేశంపై అందరి దృష్టీ పడింది. క్రాస్ ఓటింగ్‌కు కారణమైన వారిని గుర్తించి.. చర్యలు తీసుకుంటారా? పార్టీ సమీక్షలో ఈ రగడను టచ్ చేస్తారా అనే ఆసక్తి గులాబీ వర్గాల్లో ఉంది. మరి… ఖమ్మం క్రాస్ ఓటింగ్ ఎపిసోడ్‌లో ఎలాంటి మలుపులు తిరుగుతాయో చూడాలి.