హుజురాబాద్‌లో టీఆర్ఎస్ శ్రేణులు ఆశ.. నిరాశల మధ్య ఊగిసలాడారా? పార్టీ చీఫ్ కేసీఆర్ ఎన్నికల సభ ఉంటుందని.. ఆ తర్వాత ఉండదని తేలడంతో ఆలోచనలో పడ్డారా? ప్లీనరీలో కేసీఆర్ మాట్లాడిన మాటలు.. కేడర్‌లో ఉత్సాహం నింపాయా?
కేసీఆర్ సభతో గెలుపు ఉత్సాహాన్ని రెట్టింపు చేయాలని చూశారు..!
హుజురాబాద్ ఉపఎన్నిక ప్రచార గడువు ముగిసే టైమ్ దగ్గర పడింది. ప్రధానపార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. అధికారపార్టీ టీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేలా పావులు కదుపుతోంది. కీలక ఎన్నికల బాధ్యతల్లో ఉన్న నాయకులు.. నియోజకవర్గంలో మకాం వేశారు. ఇదే సమయంలో పార్టీ చీఫ్ కేసీఆర్ ఎన్నికల ప్రచారసభతో హుజురాబాద్‌లో గెలుపు ఉత్సాహాన్నిరెట్టింపు చేసుకోవచ్చని గులాబీ దండు భావించింది.
ఈసీ ఆదేశాలతో సీఎం సభపై వెనక్కి తగ్గిన టీఆర్ఎస్..!
హుజురాబాద్‌లో కేసీఆర్ ప్రచార సభ ఏర్పాట్లపై టీఆర్ఎస్ కొంత సమాలోచన చేసింది. దళితబంధు స్కీమ్‌ను హుజురాబాద్‌లోనే ప్రారంభించారు. సీఎం కేసీఆర్ హాజరై దళితబంధు లబ్ధిదారులకు చెక్‌లు అందచేశారు కూడా. ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైన తర్వాత మరోసారి సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారసభ ఉంటుందని చర్చ జరిగింది. సభ ఎప్పుడు పెట్టాలి.. ఎక్కడ ఉండాలి… జనసమీకరణ.. ఇలా చాలా అంశాలపై వడపోతలు పూర్తయ్యాయి. ప్రచార గడువు ముగిసే చివరి రోజు హుజురాబాద్‌కు ఆనుకుని ఉన్న పెంచికల్‌పేట్‌లో సభకు ముహూర్తం ఫిక్సైంది. అయితే సరిహద్దు ప్రాంతాల్లోనూ సభలు పెట్టకూడదని EC ఉత్తర్వులు ఇవ్వడంతో వెనక్కి తగ్గింది టీఆర్ఎస్.
ప్లీనరీలోనే ఉపఎన్నిక ప్రచార వేడి రగిలించారా?
తెలంగాణ ఏర్పాటు తర్వాత పలు ఉపఎన్నికలను టీఆర్ఎస్ ఎదుర్కొంది. రెండోసారి అధికారం చేపట్టాక హుజూర్‌నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్ ఉపఎన్నికలు వచ్చాయి. హుజూర్‌నగర్ ఉపఎన్నిక ప్రచారానికి కేసీఆర్ వెళ్లాలని అనుకున్నా వాతావరణం అనుకూలించక వెళల్లేదు. దుబ్బాక ఉపఎన్నికకు దూరంగా ఉన్నారు పార్టీ చీఫ్. నాగార్జునసాగర్ ఉపఎన్నికకు ముందు ఒకసారి.. ఆ తర్వాత మరోసారి అక్కడ సభల్లో పాల్గొన్నారు కేసీఆర్. హుజురాబాద్‌లో ప్రచార సభ లేకపోవడంతో.. పార్టీ ప్లీనరీలోనే కేసీఆర్ మాట్లాడారు. గెల్లు శ్రీనివాస్‌ను హుజురాబాద్ ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ ప్రచారంలో మరింత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు..!
టీఆర్‌ఎస్ ప్లీనరీని ప్రచార వాగ్భాణాలకు వేదికగా చేసుకున్నా.. స్వయంగా అక్కడికి వెళ్లకపోవడంపై కేడర్‌లో ఒకింత నిరాశ కలిగిందట. అలాగే ప్రచారంలో ఉన్న నాయకులు ప్లీనరీకి హాజరు కాలేదు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోరు కావడంతో ఎక్కడివారు అక్కడే అన్నట్టు ఉండిపోయారు. అయితే లాస్ట్ పంచ్‌లో భాగంగా కేసీఆర్ వస్తే బాగుండేదనే అభిప్రాయం కేడర్‌లో బలంగా నాటుకుపోయింది. అందుకే కేసీఆర్ వస్తారు అన్నప్పుడు ఆశగా ఎదురు చూసిన శ్రేణులు.. ఇప్పుడు సభ లేకపోవడంతో నిరాశ చెందుతున్నాయి. కాకపోతే ఆ ఎఫెక్ట్ కేడర్‌పై పడకుండా టీఆర్ఎస్ ప్రచారానికి మరింత మంది మంత్రులు, ఎమ్మెల్యేలు జతయ్యారు. సాగర్ ఉపఎన్నిక మాదిరి.. ఫలితాల తర్వాత మరోసారి సీఎం వస్తారని చెబుతున్నారట. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.