Off The Record: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి నీళ్ళలో నిప్పులు రాజుకోవడం ఖాయమా? జాతీయ జెండా సాక్షిగా ఆ విషయంలో క్లారిటీ వచ్చిందా? స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ప్రసంగంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బనకచర్లను ప్రస్తావించడం ద్వారా హీట్ పెంచారా? వ్యక్తిగత పరిచయాలకు, రాష్ట్ర ప్రయోజనాలకు ముడిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు, రేవంత్ రెడ్డి తేల్చేశారా? ఇంతకీ వాళ్ళిద్దరూ ఏమన్నారు? కొత్త చర్చ ఏంటి?
Read Also: Bandi Sanjay: “మర్వాడీ గో బ్యాక్” అంశంపై స్పందించిన బండి సంజయ్.. ఏమన్నారంటే..?
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి మధ్య ఉండే సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అసవసరం లేదు. దాన్ని బేస్ చేసుకుని రెండు రాష్ట్రాల్లోని ప్రతిపక్షాలు ఇద్దర్నీ రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాయి కూడా. ఎవరి రాజకీయం ఎలా ఉన్నా…. మేం మాత్రం మా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని చెబుతున్నారు ఇద్దరు నాయకులు. తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అన్నట్టుగా ఉంటోంది వ్యవహారం. తాజాగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సాక్షిగా… ఇద్దరూ తమ వైఖరిని మరోసారి బయటపెట్టడం గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది రెండు రాష్ట్రాల్లో. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో తగ్గేదేలే అన్నట్టుగా ఉన్నాయి ఇద్దరి వ్యాఖ్యలు. ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో రాజకీయ రచ్చ జరుగుతున్న టైంలో ఇద్దరి మాటలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Read Also: Off The Record: వైసీపీకి దమ్మాలపాటి సమాచారం చేరవేస్తున్నారా?
నీటి వాటాల పంపిణీ, రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడిన తెలంగాణ సీఎం…. బనకచర్ల ప్రాజెక్ట్ పై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. కృష్ణా, గోదావరి నదుల్లో నీటివాటా హక్కుపై రాజీలేదని, తెలంగాణకు రావాల్సిన నీళ్ల వాటా దక్కించుకుంటాం అని క్లారిటీగా చెప్పేశారాయయన. హక్కు మేరకు తెలంగాణ అవసరాలు తీరాకే మిగతా రాష్ట్రాలకు నీరు అన్నారాయన. గత ప్రభుత్వం లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయిందంటూ ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ను కూడా టార్గెట్ చేశారు రేవంత్. పాలమూరు -రంగారెడ్డి, ఎస్ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టుల్ని తమ హయాంలో పూర్తి చేస్తామని చెప్పారు తెలంగాణ సీఎం. రాష్ట్రంలో చివరి ఆయకట్టు వరకు నీరందిస్తాం అని హామీ ఇచ్చారాయన. అదే సమయంలో అటు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పంద్రాగస్టు వేడుకల్లో బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. ఈ ప్రాజెక్ట్‌తో ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదన్న ఏపీ సీఎం.. బనకచర్లపై ఎవరూ అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
Read Also: Krishna Janmashtami 2025: కృష్ణుడి ఎనిమిది మంది భార్యల పేర్లు ఇవే..
అయితే, సముద్రంలోకి వృథాగా పోయే నీటినే వాడుకుంటామని మరోసారి జాతీయ జెండా సాక్షిగా ప్రకటించారు చంద్రబాబు. ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద నీటితో నష్టాలను కూడా భరిస్తున్నామని, అదే వరద నీటిని వాడుకుంటామంటే అభ్యంతరమేంటంటూ పరోక్షంగా తెలంగాణ సర్కార్‌కు ప్రశ్నాస్త్రాన్ని సంధించారాయన. వరదను భరించాలి, దాని వల్ల నష్టపోవాలిగానీ… ఆ నీటిని మాత్రం వాడుకోవద్దా? అంటూ నిలదీశారు చంద్రబాబు. ఇలా ఇద్దరు ముఖ్యమంత్రులు నీటి వాటాల పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఎవరికి వారు ఆ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే మాట్లాడారు తప్ప… ఎక్కడా రాజీ ధోరణి ప్రదర్శించలేదన్న చర్చ జరుగుతోంది. అనూహ్యంగా ఇద్దరు ముఖ్యమంత్రులు బనకచర్ల గురించి ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. ఆ ప్రాజెక్ట్‌ను ఏపీ ముఖ్యమంత్రి నేరుగా ప్రస్తావించగా…తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం ఎక్కడా ప్రాజెక్టు పేరు కానీ, రాష్ట్రం ప్రస్తావన చేయకుండా పరోక్ష విమర్శలు చేశారు. తెలంగాణ ప్రతిపక్షాలు గురు శిష్యులు, గురుదక్షిణల్లాంటి పదాలు వాడినా…. అవన్నీ రాజకీయం కోసమే తప్ప వాస్తవంలో అంత సీన్ లేదని, నాకు నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని తెలంగాణ సీఎం క్లారిటీగా చెప్పేసినట్టు అయిందంటున్నారు పరిశీలకులు. అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు కూడా… వరద నష్టాన్ని భరిస్తున్నాం, ఆ నీటిని ఎందుకు వాడుకోకూడదంటూ సెంటిమెంట్‌ను జోడించిన టెక్నికల్ పాయింట్ మాట్లాడ్డం ఆసక్తికరంగా మారింది.