టీడీపీ ఎన్నికల వ్యూహంపై చర్చ టార్గెట్ బిగ్‌షాట్స్. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రస్తుతం అమలు చేయాలని అనుకుంటున్న ప్రణాళిక. ఇటీవల సీఎం జగన్ వైసీపీ రీజినల్ కో-ఆర్డినేటర్లు.. జిల్లా అధ్యక్షులు, మంత్రులతో సమావేశమయ్యారు. పార్టీ బాధ్యతలను రీజినల్ కో-ఆర్డినేటర్లు.. జిల్లా అధ్యక్షుల మీద పెట్టారు. మంత్రులకంటే వారే ఎక్కువ అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు సీఎం జగన్. వచ్చే ఎన్నికల్లో సమన్వయకర్తలు.. జిల్లా అధ్యక్షులు గెలవడంతోపాటు వారి పరిధిలోని ఉన్న నియోజకవర్గాల అభ్యర్థులను కూడా గెలిపించాల్సిన బాధ్యత వారికే అప్పగించారు. దీంతో టీడీపీ కూడా దాదాపు అదే స్ట్రాటజీని అమలు చేయాలని చూస్తోంది.
గత ఎన్నికల్లో ఓటమి తర్వాత దెబ్బతిన్న టీడీపీని బలోపేతం చేసుకోవడంతోపాటు వైసీపీలోని బిగ్‌షాట్స్‌కు గురిపెట్టబోతోంది. అలా టీడీపీ నజర్‌లో పడ్డవాళ్లే వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లు.. జిల్లా అధ్యక్షులు. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ఎవరిమీద బాధ్యతలు పెట్టారో.. వారిని ఎలాగైనా ఓడించే దిశగా కసరత్తు చేపట్టాలని లోకల్ లీడర్స్‌కు సంకేతాలు పంపారట. అంతేకాదు.. చంద్రబాబు కూడా నేరుగా ఫీల్డ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ నెల 4, 5 తేదీల్లో చేపట్టే ఉత్తరాంధ్ర పర్యటనలో ఆయన ఎంచుకున్న రెండు నియోజకవర్గాలు ప్రస్తుతం చర్చగా మారాయి. 4న ఆమదాలవలస వెళ్తున్నారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం. అసెంబ్లీ స్పీకర్. మరుసటి రోజు భీమిలి వెళ్తున్నారు చంద్రబాబు. అక్కడ నుంచి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
చిత్తూరు జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించడంతోపాటు అక్కడ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లక్ష్యంగా రాజకీయంగా గట్టి స్కెచ్చే వేసినట్టు తెలుస్తోంది. పుంగనూరులో పెద్దిరెడ్డిని.. తంబళ్లపల్లిలో ఆయన సోదరుడు ద్వారకానాథరెడ్డిని ఓడించాలని పావులు కదుపుతోందట. తంబళ్లపల్లి నుంచి వైసీపీకి చెందిన ఒక జడ్పీటీసీ ఇటీవల చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో అధికారపార్టీ నుంచి టీడీపీలోకి వైసీపీ జడ్పీటీసీ రావడం సాధారణ అంశం కాదన్నది తమ్ముళ్ల మాట.
రాజకీయంగానే కాకుండా.. వైసీపీ లీడర్స్‌కు చెందిన ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే విధంగా కసరత్తు చేయాలని స్థానిక టీడీపీ నాయకత్వాలకు సూచనలు వెళ్లాయట. టీడీపీ టార్గెట్‌లో ఉన్న నాయకులకు ఉన్న ఆర్థిక వనరులు.. అక్కడున్న లోటుపాట్లు.. బయటకు రాని అక్రమాలపై నిఘా పెట్టాలని గట్టిగానే సూచిస్తున్నారట. ఏ మాత్రం అవకాశం చిక్కినా వారిని ఎక్స్‌పోజ్ చేయడానికి ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలని చెబుతున్నారట. అలా టీడీపీ నజర్‌లో పడింది చిత్తూరు జిల్లాలోని శివశక్తి డెయిరీ. ఈ డెయిరీలో పాల సేకరణ ఏ విధంగా జరుగుతోంది? పాడి రైతులకు ఎంత చెల్లిస్తున్నారో కూపీ లాగుతున్నారు. శివశక్తి డెయిరీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో ఉంది.
ఇక కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి విషయంలో అనుకున్నంత స్థాయిలో టీడీపీ లోకల్ లీడర్స్ పోరాటం చేయడం లేదనే భావనలో ఉన్నారట చంద్రబాబు. దానిని దృష్టిలో పెట్టుకునే ఇటీవల జరిగిన నియోజకవర్గ నేతల సమావేశంలో చిన్న సైజ్ క్లాస్ తీసుకున్నారట. మొత్తానికి టీడీపీ టార్గెట్‌లో ఉన్న వైసీపీ నేతల విషయాన్ని లోకల్ లీడర్స్‌కే వదిలేయకుండా చంద్రబాబు కూడా ఫీల్డ్ ఎంట్రీ ఇస్తుండటంతో పాలిటిక్స్ ఆసక్తిగా మారే సూచనలు కనిపిస్తోంది.