మంత్రివర్గంలో బెర్త్ మొదటిసారి తృటిలో తప్పినా.. రెండోసారి మాత్రం ఛాన్స్ దక్కించుకున్నారు. కానీ.. ఆ ఆనందం మాత్రం మిగలడం లేదు. మంత్రిగా జిల్లాలో అడుగు పెట్టకముందే.. ఒకవైపు సొంత పార్టీ నాయకుల నుంచి.. మరోవైపు పాత కేసులు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయట. ఇంతకీ ఆ మంత్రి ఎవరు? ఆయన వచ్చిన కష్టాలేంటి? ఆదిలోనే హంసపాదుగా మారిన విషయాలేంటి?
కాకాణి గోవర్దన్‌రెడ్డి. నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే. ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడే తొలి కేబినెట్‌లో చోటు దక్కుతుందని ఆశించారు కాకాణి. కానీ.. అనుకున్నదొక్కటీ.. అయ్యిందొక్కటీ. ఇటీవల చేపట్టిన కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో మాత్రం ఆశ నెరవేరింది. పొలిటికల్‌గా జీవితాశయం నెరవేరిందన్న సంతోషంలో ఉండగానే.. సొంత జిల్లా నెల్లూరులో కాకాణికి కొత్త కష్టాలు స్వాగతం పలుకుతున్నాయి. వాటి గురించే ఇప్పుడు అధికారపార్టీలో.. పొలిటికల్ సర్కిళ్లలో జోరుగా చర్చ జరుగుతోంది.
మంత్రిగా కాకాణి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్.. జర్క్ ఇచ్చారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు తనపట్ల కాకాణి ఎంత ప్రేమ.. అనురాగం కురిపించారో.. సహకారం అందించారో అంతకు రెట్టింపు ఇస్తారనని వ్యంగ్యాస్త్రాలు సంధించారు అనిల్. ఆ కామెంట్స్‌పై చర్చ జరుగుతున్న సమయంలోనే మంత్రి కాకాణికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నెల్లూరు సిటీలో అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. ఇది అనిల్ వర్గం పని అనేది కాకాణి అనుచరుల అనుమానం.
మంత్రిగా సొంత జిల్లాలో కాకాణి అడుగుపెడుతున్న రోజే.. నెల్లూరులో అనిల్ బహిరంగ సభ పెట్టడం కూడా చర్చగా మారింది. ఇది బల ప్రదర్శన కాదని అనిల్ వర్గం చెబుతున్నా.. తన వర్గం నుంచి ఎవరూ కాకాణి దగ్గరకు వెళ్లకుండా కట్టడి చేయడానికి సభ పెట్టారన్నది కొందరి అభిప్రాయం. ఇంతలో కోర్టులో డాక్యుమెంట్ల చోరీ కేసు రాష్ట్రంలో సంచలనం రేపింది. ఐదేళ్ల క్రితం టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి… కాకాణిపై పెట్టిన కేసు అనూహ్య మలుపు తీసుకుంది. విదేశాల్లో తనకు వేల కోట్లు ఉన్నాయన్న కాకాణి ఆరోపణలపై సోమిరెడ్డి కేసు పెట్టారు. కాకాణి చూపించిన పత్రాలు నకిలీవిగా తేలడంతో ఆ కేసులో కాకాణి Aవన్‌గా ఉన్నారు. ఈ కేసు విచారణకు వచ్చే తరుణంలో కీలకంగా భావిస్తున్న డాక్యుమెంట్లు కోర్టు నుంచి చోరీ అయ్యాయి.
చోరీ వెనక కాకాణి వర్గం ఉందన్నది టీడీపీ ఆరోపణ. శిక్ష పడుతుందని తెలిసే సాక్ష్యాలను మాయం చేశారని.. ఈ అంశంపై సుప్రీంకోర్టు వరకు వెళ్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. కోర్టులో చోరీ కూడా మంత్రి కాకాణి శిబిరాన్ని ఇరకాటంలో పడేసిందని టాక్. ఒకవైపు సొంతపార్టీ నేతల వ్యంగ్యాస్త్రాలు.. ఫ్లెక్సీల చించివేత.. బలప్రదర్శన.. ఇంకోవైపు కోర్టులో చోరీ.. మంత్రికి ఆదిలోనే హంసపాదుగా మారాయని వైసీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. అందుకే రానున్న రోజులు మంత్రిగా కాకాణికి సొంత జిల్లాలో ముళ్లబాటేనని అభిప్రాయపడుతున్నారట.
Watch Here : https://youtu.be/UGMMt6dXDyI