Off The Record: మాజీ మంత్రి అంబటి రాంబాబు మీద డస్ట్‌బిన్ బాంబు పడబోతోందా? ఆయన మీద యాక్షన్‌కు కౌంట్‌డౌన్ మొదలైందా? ఇన్నాళ్ళు పెట్టిన కేసులకు భిన్నంగా ఇప్పుడు పావులు కదులుతున్నాయా? విషయం తెలిసే… నన్ను జైలుకు పంపే ప్రయయత్నం జరుగుతోందని ఆయన అంటున్నారా? ఇంతకీ ఏంటా డస్ట్‌బిన్ బాంబ్? మాజీ మంత్రికి, డస్ట్‌బిన్‌కు లింకేంటి?
బాగా నోరున్న మా పార్టీ నేతల్లో అంబటి రాంబాబు తొలి వరుసలో ఉంటారని చమత్కరిస్తుంటారు వైసీపీ నాయకులు. అందుకు తగ్గట్టే బయట కూడా ఆయనకు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతకాలం వైసీపీ నేతలు సైలెంట్ అయిపోయినా.. తర్వాత అందరికంటే ముందు సర్కార్ మీద వాయిస్ రెయిజ్ చేశారు అంబటి. పార్టీ అధినేత జగన్, ఆయన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్స్ విషయంలో పోరాటం మొదలుపెట్టి గుంటూరు పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారాయన. కేసు బుక్ చేయలేదంటూ హైకోర్ట్ మెట్లు ఎక్కడమేగాక ఏకంగా పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేయడంతో ఆన మీద కేసు నమోదైంది. తర్వాత జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా బారికేడ్స్ తీసేయడం, పోలీసులతో వాగ్వాదానికి దిగడం లాంటి చర్యలతో ఇంకో కేస్ పడింది.
Read Also: Madhya Pradesh: 16 ఏళ్ల బాలిక అశ్లీల వీడియో వైరల్.. మధ్యప్రదేశ్‌లో టెన్షన్ టెన్షన్..
ఆ తర్వాత గుంటూరులో వైసీపీ విద్యార్ది విభాగం చేపట్టిన కార్యక్రమంతోపాటు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలో ఆయనకు పట్టాభిపురం సీఐతో జరిగిన గొడవ రాజకీయ దుమారం రేపింది. వాటికి సంబంధించి అంబటిపై రెండు కేసులు నమోదయ్యాయి. అయితే… రెండోసారి నమోదైన కేసులో బలమైన సెక్షన్స్ పెట్టారు పోలీసులు. దీంతో తనను అరెస్టు చేసి జైలుకు పంపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, వాళ్ళు పెట్టిన సెక్షన్సే ఆ విషయం చెబుతున్నాయంటూ స్టేట్‌మెంట్స్ ఇచ్చారు మాజీ మంత్రి. కారణం ఏదైనాగానీ… కేసుపెట్టి పోలీసులు సైలెంట్‌గానే ఉన్నారు. ఇలాంటి వాతావరణంలో తాజాగా సత్తెనపల్లి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జరిగిన పరిణామాలు మళ్ళీ చర్చకు తెరలేపాయి. 2019 ఎన్నికల్లో అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పుడు మంత్రిగా కూడా పనిచేశారు. అంబటి మంత్రిగా ఉన్న సమయంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అప్పట్లో హాట్ టాపిక్. ఆ వేడుకల్లో భాగంగా లాటరీ తీసి బహుమతులు అందించారు. మంత్రిగా ఉండి లాటరీల పేరుతో డబ్బులు వసూలు చేశారంటూ అప్పట్లో జనసేన నేతలు అంబటిపై మండిపడ్డారు.
Read Also: Tragedy: అమెరికాలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి..
అలాగే, సత్తెనపల్లి మున్సిపల్ సమావేశంలో డస్ట్‌బిన్స్ కొనుగోలుకు సంబంధించి చర్చ జరిగింది. ఇందులో 54లక్షల రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయని కౌన్సిలర్ సుమన్ ఆరోపించారు. అంతేకాదు డస్ట్ బిన్స్ కోసం రెండు కోట్ల రూపాయల విరాళాలు వసూలు చేశారన్నది ఆయన అభియోగం. అదంతా ఒక ఎత్తయితే…. దానికి సంబంధించి వైసీపీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ లక్ష్మి రియాక్ట్ అయిన తీరే మరింత సంచలనం సృష్టించింది. అప్పట్లో మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు డబ్బులు వసూలు చేస్తే ఇప్పుడు తమపై నిందలేస్తే ఎలా అంటూ ఆగ్రహించారామె. ఆ రియాక్షన్‌తో ఆంతా కంగుతిన్నారట. వైసీపీకే చెందిన ఛైర్‌పర్సన్ అయిన లక్ష్మి అదే పార్టీకి చెందిన మాజీ మంత్రిపై ఇలా మాట్లాడడం ఏంటంటూ కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతం అంబటి సత్తెనపల్లినుంచి గుంటూరుకు వచ్చారు. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్ చార్జిగా ఉన్న టైంలో ఇలా పాత వ్యవహారంపై కౌన్సిల్ సమావేశంలో చర్చ యాదృచ్చికం కాదని, దీని వెనుక అంబటిని టార్గెట్ చేసే వ్యూహం ఉండవచ్చని అంచనా వేస్తున్నాయి వైసీపీ వర్గాలు. కౌన్సిల్‌లో జరిగిన చర్చతో… అంబటి అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదు చేసే అవకాశం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలా మాజీ మంత్రిని అవినీతి కేసులో అడ్డంగా బుక్ చేద్దామన్న ప్రయత్నాల్లో భాగంగానే డస్ట్‌బిన్స్ వ్యవహారం తెరపైకి వచ్చి ఉంటుందని అంటున్నారు. ఈ పరిణామాలు ఎట్నుంచి ఎటు వెళతాయోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.