Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని షామ్‌గఢ్ నగరంలో శుక్రవారం 16 ఏళ్ల బాలిక అశ్లీల వీడియో వైరల్ అవ్వడం, ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తున్న భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. బాధితురాలు 12వ తరగతి చదువుతోంది. ఈ ఘటన తర్వాత షామ్ గఢ్ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అధికారులు దాదాపుగా ఇంటర్నెట్ షెట్ డౌన్ చేశారు. శాంతిభద్రతలను కాపాడేందుకు పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు. పొరుగు జిల్లాల నుంచి కూడా అదనపు పోలీస్ సిబ్బందిని తరలించారు. ఈ ఘటన వెనక ఉన్న ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు.
Read Also: Tragedy: అమెరికాలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి..
నవంబర్ 6న మైనర్ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రిహాన్, బాబు అనే ఇద్దరు నిందితులు, కత్తిలో బెదిరించి బాలిక తల్లి సెల్‌ఫోన్ లో బాలిక అశ్లీల వీడియో తీశారు. ఆ తర్వాత ఆ వీడియోను నిందితులు తమ సెల్‌ఫోన్‌కు పంపించుకున్నారు. వీడియో వైరల్ చేస్తామని బెదిరించారు. తమకు రూ. 5 లక్షలు ఇవ్వాలని కుటుంబాన్ని బెదిరించారు. బాధిత కుటుంబం బాలిక జీవితం నాశనమవుతుందని రూ. 2 లక్షలు ఇచ్చారు. మిగిలిన డబ్బు కోసం నిందితులు బలవంతం చేశారు. ఆ తర్వాత గురువారం సాయంత్రం ఈ వీడియోను ఆ ప్రాంతంలో వైరల్ చేశారు.
ఈ సంఘటన తర్వాత నిందితులపై చర్యలు తీసుకోవాలని షామ్‌గఢ్ పోలీస్ స్టేషన్ ముందు వందలాది మంది ఆందోళన నిర్వహించారు. శుక్రవారం హిందూ సంస్థలు కూడా నిరసనలో చేరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. షామ్ గఢ్ ప్రాంతంలో దుకాణాలు మూసేశారు. నిందితులను పోలీసులు 12 గంటల్లోనే అరెస్ట్ చేశారు. మున్సిపాలిటీ రిహాన్, బాబులకు చెందిన అక్రమ నిర్మాణాలపై చర్యలు ప్రారంభించింది. నీటి కనెక్షన్లను తొలగించింది. ఈ ఘటనపై పోలీసులు పోక్సో, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.