ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్-2023లో జింబాబ్వే టీమ్ భారీ తేడాతో విజయం సాధించింది. హరారే వేదికగా ఇవాళ్టి (సోమవారం) మ్యాచ్‌లో యూఎస్‌ఏను ఏకంగా 304 పరుగుల తేడాతో మట్టికరిపించింది. వన్డేల్లో అత్యధిక తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించిన జట్టుగా టీమిండియా తర్వాతి ప్లేస్ లో జింబాబ్వే నిలిచింది. సొంతగడ్డపై వన్డే వరల్డ్‌కప్-2023 క్వాలిఫయర్స్‌లో ఇప్పటికే సూపర్ సిక్సెస్‌కు అర్హత సాధించిన జింబాబ్వే ఇవాళ యూఎస్‌ఏతో నామమాత్రపు మ్యాచ్‌లో పోటీపడింది. టాస్ గెలిచిన యూఎస్‌ఏ ఫిల్డింగ్ తీసుకుంది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 408 పరుగులు స్కోరు చేసింది.
Read Also: Health Tips: మలబద్ధకం, ఉబ్బరం నుండి ఉపశమనం పొందండి. ఇది వాడారంటే చాలు..!
వన్డేల్లో తమ అత్యధిక స్కోరు నమోదు చేసిన జింబాబ్వే చరిత్ర సృష్టించింది. కెప్టెన్ సీన్ విలియమ్స్ 101 బంతుల్లో ఏకంగా 21 ఫోర్లు, 5 సిక్సర్లతో పరుగుల సునామీ సృష్టించి 174 పరుగులు చేశాడు. ఓపెనర్ గుంబీ 78 పరుగులు చేయగా.. సికందర్ రజా 48, రియాన్ బర్ల్ 47 పరుగులతో రాణించారు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఎస్‌ఏ జట్టు 104 పరుగులకే కుప్పకూలింది. జింబాబ్వే బౌలర్ల సమిష్టికృషితో 25.1 ఓవర్లకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో యూఎస్‌ఏ బ్యాటర్లు నమోదు చేసిన స్కోర్లు వరుసగా.. 0,6,9,8,13,0,24,2,21,6,0గా నమోదైంది.
Read Also: Chitragupta Temple: 450 ఏళ్ళ గుడి..ఒక్క అభిషేకం చేస్తే మీ బాధలు అన్నీ మటుమాయం?
యూఎస్‌ఏ బ్యాటర్లంతా మూకుమ్మడిగా విఫలం కావడంతో.. ముఖ్యంగా టాపార్డర్ దారుణమైన వైఫల్యంతో యూఎస్‌ఏకు 304 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఇక కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన జింబాబ్వే సారథి సీన్ విలియమ్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. యూఎస్‌ఏపై సంచలన విజయం నమోదు చేసిన జింబాబ్వే వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో ప్రత్యర్థిని ఓడించిన రెండో జట్టుగా ఘనత సాధించింది. మేటి జట్లను వెనక్కి నెట్టి.. టీమిండియా తర్వాతి స్థానాన్ని జింబాబ్వే టీమ్ ఆక్రమించింది.