Yuvraj Singh Praises Virat Kohli: ఈ తరం అత్యుత్తమ బ్యాటర్ ‘కింగ్’ విరాట్ కోహ్లీనే అని భారత మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. నెట్స్‌లో చాలా తీవ్రంగా శ్రమించడం వలనే.. అందరి కంటే భిన్నంగా రాణించగలుగుతున్నాడన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024లో కోహ్లీ కీలక పాత్ర పోషిస్తాడని, పొట్టి టోర్నీని సగర్వంగా ఎత్తుకోవాలనే లక్ష్యంతో ఉన్నాడని యూవీ చెప్పాడు. కోహ్లీతో పాటు స్టీవ్ స్మిత్, జో రూట్, కేన్ విలియమ్సన్‌లు ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో అత్యుత్తమ ప్లేయర్స్. ఈ నలుగురిని అందరూ అత్యుత్తమ బ్యాటర్లు అని అంటున్నారు.
టీ20 ప్రపంచకప్ 2024 బ్రాండ్ అంబాసిడర్‌గా యువరాజ్ సింగ్‌ను ఐసీసీ నియమించింది. ఈ నేపథ్యంలో ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యూవీ పలు విషయాలపై స్పందించాడు. ‘విరాట్ కోహ్లీ ఈ తరంలో అన్ని రికార్డులను బద్దలు కొడతాడు. ప్రస్తుత తరానికి అన్ని ఫార్మాట్లలో విరాట్ బెస్ట్ బ్యాటర్. కోహ్లీ టీ20 ప్రపంచకప్‌ను సగర్వంగా ఎత్తుకోవాలనే లక్ష్యంతో ఉన్నాడు. ఇప్పటికే ఓ కప్ గెలిచినా.. దానితో సంతృప్తిగా లేడు’ అని యువరాజ్ అన్నాడు. కోహ్లీ 2011 వన్డే ప్రపంచకప్‌ను గెలిచిన విషయం తెలిసిందే. 2012లో తొలిసారి పొట్టి కప్‌లో ఆడిన కోహ్లీకి 2024 కప్ ఆరోది.
Also Read: Abhishek Sharma: అభిషేక్ శర్మ.. నీకు సమయం ఆసన్నమైంది!
‘విరాట్ కోహ్లీ ఆటను బాగా అర్థం చేసుకుంటాడు. క్రీజ్‌లో చివరి వరకూ ఉన్నాడంటే.. మ్యాచ్‌ను ముగించగలడు. ఒంటరిగానే భారత్‌ను గెలిపించిన సందర్భాలూ ఎన్నో ఉన్నాయి. ఒక్కసారి కుదురుకుంటే ఎలాంటి లక్ష్యాన్నైనా భారత్ ఛేదించినట్లే. ఏ బౌలర్‌పై ఎటాకింగ్ గేమ్ ఆడాలి, ఎవరి బౌలింగ్‌లో సింగిల్స్ తీయాలని అతడికి తెలుసు. ప్రత్యర్థి బౌలింగ్‌ను గౌరవించి.. అవకాశం వచ్చినప్పుడు దూకుడు మొదలెట్టేస్తాడు. ఇప్పుడు కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2024లో 500కు పైగా స్కోరు చేశాడు. నెట్స్‌లో తీవ్రంగా శ్రమించడం వల్లే అందరికీ భిన్నంగా రాణిస్తున్నాడు’ అని యువీ చెప్ప్పుకొచ్చాడు.