Andhra Pradesh: పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెంకుపాలెంలో వైసీపీ కార్యకర్త ఒంటేరు నాగరాజును కిడ్నాప్ చేశారు. ఆటోలో కూరగాయలు అమ్ముకుంటున్న నాగరాజును బొలెరో వాహనంతో అడ్డుకుని.. బలవంతంగా తీసుకెళ్లిన ప్రత్యర్థులు.. అడ్డుకున్న నాగరాజు కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. దుర్గి మండలం జంగమేశ్వర పాడుకు చెందిన ,నాగరాజు ఎన్నికల అనంతరం వినుకొండలోని బంధువుల వద్దకు వెళ్లి ఆశ్రయం పొందుతున్నాడు. వైసీపీకి చెందిన నాగరాజు వెంకుపాలెం వద్ద కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పాత కక్షల నేపథ్యంలో నాగరాజును బొలెరో వాహనం అడ్డుపెట్టి కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు ప్రత్యర్థులు. నాగరాజును కిడ్నాప్ చేసి వెళుతున్న వారిని అడ్డుకున్న క్రమంలో కొందరికి గాయాలయ్యాయి. గాయాలైన వారిని నరసరావు పేట ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కిడ్నాప్‌కు గురైన నాగరాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Also: CM Chandrababu: బెంగాల్ మాజీ సీఎం మృతిపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
కిడ్నాప్‌కు గురైన ఒంటేరు నాగరాజును హత్య చేసి ఉంటారని అతని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే బొలెరో వాహనంలోకి ఎక్కించే లోపే నాగరాజుపై గొడ్డలితో దాడి చేసినట్లుగా అతని బంధువులు చెబుతున్నారు. కిడ్నాప్ చేసిన నాగరాజును ఇప్పటికే హత్య చేసి ఉంటారని అతని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నాగరాజు కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపడంతో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. వినుకొండ, మాచర్ల నియోజకవర్గలలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.