తాడేపల్లిలోని వైసీపీ సెంట్రల్ ఆఫీస్‌లో వైసీపీ ‘ఫీజు పోరు’ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయక పోవడానికి నిరసనగా విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఫిబ్రవరి 5న ఫీజు పోరు కార్యక్రమం నిర్వహించేందుకు వైసీపీ సిద్ధమైంది.
ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజులు చెల్లించటంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఫీజులు చెల్లించకపోవటంతో యాజమాన్యాలు విద్యార్ధులను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు.. పేద విద్యార్ధులు కళాశాలలకు వెళ్లలేని పరిస్థితి వచ్చిందని తెలిపారు. చంద్రబాబు ఫీజులు చెల్లించకపోవటంతో విద్యార్ధులు కూలీలుగా మారిపోయే అవకాశం ఉంది.. ఫీజులు తల్లిదండ్రులకు భారం కాకూడదని వైఎస్ఆర్ ఈ పథకాన్ని తెచ్చాడన్నారు. నమ్మి ఓట్లు వేసిన ప్రజలను చంద్రబాబు మోసం చేశాడు.. సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు విద్యా శాఖ మంత్రి లోకేష్ ఫీజులు చెల్లించే వరకు ఊరుకునేది లేదని అంబటి రాంబాబు హెచ్చరించారు.
Read Also: Monalisa Kumbh: బాలీవుడ్ సినిమా సైన్ చేసిన తేనెకళ్ల మోనాలిసా
జోగి రమేష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్ధులకు బకాయిలు చెల్లించకుండా నట్టేట ముంచారని దుయ్యబట్టారు. ఫీజులు చెల్లించకపోవటంతో విద్యార్ధులను కళాశాలలకు రావటానికి అనుమతి కూడా ఇవ్వటం లేదన్నారు. ఫీజులు చెల్లిస్తామని చెప్పి మోసం చేసిన చంద్రబాబు.. అబద్ధాలు చెప్పటానికి సిగ్గులేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజులు కట్టలేక విద్యార్ధుల తల్లిదండ్రులు రోదిస్తున్నారు.. నిరుపేదలు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారంటే వైఎస్సార్ తీసుకువచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ పుణ్యమేనని అన్నారు. వైయస్సార్ బాటలోనే అనేక పథకాలు అమలు చేసిన వ్యక్తి జగన్ అని జోగి రమేష్ తెలిపారు.