Pakistan: పాకిస్థాన్‌లోని సింధ్, లోయర్ పంజాబ్ ప్రాంతాల జలాశయాల్లో ప్రమాదకరమైన విదేశీ చేపలు వేగంగా విస్తరిస్తోందని డబ్ల్యూవీడబ్ల్యూఎఫ్–పాకిస్థాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చేప కారణంగా జలజీవ వైవిధ్యం, మత్స్యకారుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించింది. జనవరి 4న విడుదల చేసిన ప్రకటనలో.. సుక్కూర్ సమీపంలోని ఓ జలాశయం నుంచి కరాచీ ఫిష్ హార్బర్‌కు తీసుకొచ్చారు. ఈ వింత చేపపై తొలుత ఎవరికీ స్పష్టత లేదని తెలిపింది. దాన్ని చూసినవారు “గ్రహాంతర”గా అభివర్ణిస్తున్నారు. ఉన్నతాధికారుల పరిశీలనలో అది అమెజాన్ సైల్‌ఫిన్ క్యాట్‌ఫిష్‌గా గుర్తించినట్లు డబ్ల్యూవీడబ్ల్యూఎఫ్ వెల్లడించింది.
READ MORE: Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య.. 24 గంటల్లో రెండో ఘటన
ఈ చేప శరీరం మందంగా ఉండి, ఎముకలతో కప్పబడిన కవచంలా ఉంటుంది. ఇది పాకిస్థాన్‌కు చెందినది కాదు. మొదట అనుకోకుండా సహజ జలాశయాల్లోకి ప్రవేశించిన ఈ చేప, ఇప్పుడు సింధ్, లోయర్ పంజాబ్ ప్రాంతాల్లో బాగా స్థిరపడిపోయింది. ఈ జాతి లాటిన్ అమెరికాకు చెందినది కాగా, ప్రపంచవ్యాప్తంగా అక్వేరియం చేపగా ప్రాచుర్యం పొందింది. అయితే ఇది ఒకసారి చెరువుల్లో, జలాశయాల్లోకి ప్రవేశిస్తే, అదుపులోకి తేవడం దాదాపు అసాధ్యమని డబ్ల్యూవీడబ్ల్యూఎఫ్ పేర్కొంది. పాకిస్థాన్‌లో ఇప్పటివరకు కనీసం 26 రకాల విదేశీ చేపలు అనుకోకుండా లేదా ఉద్దేశపూర్వకంగా ప్రవేశించాయని సంస్థ తెలిపింది. ఇవన్నీ క్రమంగా ఆక్రమణ జాతులుగా మారి, స్థానిక చేపలను నాశనం చేస్తున్నాయని హెచ్చరించింది. ఈ విదేశీ చేపలు ఆహారం, స్థలాల కోసం స్థానిక జాతుల చేపలతో పోటీ పడటం, వాటిని తినేయడం, వ్యాధులు వ్యాపింపజేయడం, జలాశయాల స్వభావాన్ని మార్చడం వంటి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని వివరించింది. దీని వల్ల జీవ వైవిధ్యం తగ్గిపోవడమే కాకుండా, మత్స్య పరిశ్రమకు భారీ ఆర్థిక నష్టం జరుగుతోందని తెలిపింది.
READ MORE: Astrology: జనవరి 6, మంగళవారం దినఫలాలు..
పాకిస్థాన్‌లోకి తొలిసారి విదేశీ చేపలు 1928లో వచ్చాయని డబ్ల్యూవీడబ్ల్యూఎఫ్ గుర్తు చేసింది. అప్పట్లో ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా ప్రాంతానికి బ్రౌన్ ట్రౌట్, రేన్‌బో ట్రౌట్‌లను తీసుకొచ్చారు. 1960లలో చేపల ఉత్పత్తి పెంచాలన్న ఉద్దేశంతో మొజాంబిక్ తిలాపియా, కామన్ కార్ప్, గోల్డ్‌ఫిష్, గ్రాస్ కార్ప్‌లను ప్రవేశపెట్టారు. కానీ ఇవన్నీ తర్వాత స్థానిక చేపలకు పెద్ద ముప్పుగా మారాయి. 1980లలో సిల్వర్ కార్ప్, బిగ్‌హెడ్ కార్ప్, నైల్ తిలాపియా, బ్లూ తిలాపియా వంటి మరిన్ని జాతులు వచ్చాయి. అప్పట్లో పర్యావరణ ప్రభావాలపై సరైన అధ్యయనం చేయకపోవడం వల్ల ఇవన్నీ సహజ జలాశయాల్లో విస్తరించాయని తెలిపింది. తిలాపియా చేపల ప్రవేశం స్థానిక చేపలకు అత్యంత వినాశకరంగా మారిందని డబ్ల్యూవీడబ్ల్యూఎఫ్ పేర్కొంది. ముఖ్యంగా మంచార్, కీజర్ సరస్సుల్లో చేపల ఉత్పత్తి తీవ్రంగా పడిపోయిందని, దాంతో అక్కడి మత్స్యకారుల జీవనంపై తీవ్రమైన సామాజిక, ఆర్థిక ప్రభావం పడిందని తెలిపింది.