Rohit Sharma’s aggressively play help India will Win World Cup 2023 Title: వన్డే ప్రపంచకప్ 2023లో భారత్ విజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే 10 వరుస విజయాలు అందుకున్న టీమిండియా.. అజేయంగా ఫైనల్ చేరింది. లీగ్ దశలో 9, సెమీస్ విజయం సాధించిన రోహిత్ సేన.. నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్‌లో ఆస్ట్రేలియాను చిత్తుచేయాలని చూస్తోంది. భారత్ మూడోసారి విశ్వవిజేతగా నిలవాలని పట్టుదలగా ఉంది. అయితే ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత్ పైచేయి సాధించాలంటే.. రోహిత్ శర్మ అత్యంత కీలకం కానున్నాడు.
వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ‘ఫియర్ లెస్’ క్రికెట్ ఆడుతున్నాడు. భారత్ ముందుగా బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్ చేసినా దూకుడుగా ఆడుతున్నాడు. మొదటి ఓవర్ నుంచే బౌలర్లపై విరుచుకుపడుతూ.. పరుగుల వరద పారిస్తున్నాడు. హిట్‌మ్యాన్ సిక్సులు బాదుతుండడంతో ప్రత్యర్థి బౌలర్లు ఒత్తిడిలోకి పడిపోతున్నారు. పవర్ ప్లేలొ రోహిత్ దూకుడుగా ఆడుతుండడంతో.. భారత్ భారీ స్కోర్లు చేస్తోంది. రోహిత్ అటాకింగ్ కారణంగా తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి ఉండడం లేదు. దాంతో మిడిల్ ఓవర్లలో భారత బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నారు.
Also Read: World Cup Final 2023: ఆ ట్రెండ్ కొనసాగితే.. భారత్‌దే 2023 ప్రపంచకప్!
రోహిత్ శర్మ అటాకింగ్ కారణంగా విరాట్ కోహ్లీ పని సులువు అవుతోంది. అంతేకాదు మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్ అటాకింగ్ చేస్తున్నాడు. ఇక కేఎల్ రాహుల్ కూడా పరిస్థితులకు తగ్గట్లు ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఫైనల్లో ఆస్ట్రేలియాను ఒత్తిడిలోకి నెట్టాలంటే.. రోహిత్ తన దూకుడు ఆటను కొనసాగించాల్సిందే. తొలి 10 ఓవర్లలో రెచ్చిపోయి ఆడితే.. ఆసీస్ పేసర్లు స్టార్క్, కమిన్స్, హేజిల్ వుడ్ లయ తప్పుతారు. దాంతో మిగతా బ్యాటర్లు సులువుగా పరుగులు చేసేందుకు అవకాశం ఉంటుంది. అందుకే బ్యాటింగ్ విభాగంలో కోహ్లీ, శ్రేయస్ కంటే ఫైనల్లో రోహిత్ అత్యంత కీలకం కానున్నాడు. ప్రపంచకప్ 2023లో హిట్‌మ్యాన్ 10 మ్యాచులలో 550 రన్స్ చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 131.