Fans Feels India will win World Cup 2023 Trophy against Australia: భారత్ గడ్డపై జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 తుది అంకానికి చేరుకుంది. నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. బుధవారం ముంబైలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 70 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరింది. గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలుపొంది తుది పోరుకు అర్హత సాధించింది. రెండు టాప్ టీమ్స్ మధ్య ఫైనల్ కాబట్టి రసవత్తరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. అయితే భారత్‌దే 2023 ప్రపంచకప్ అని ఫాన్స్ అంటున్నారు.
ఓ ట్రెండ్ ప్రకారం భారత్‌దే ప్రపంచకప్ అని అభిమానులు అంటున్నారు. అదేంటంటే.. 2011 నుంచి వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చిన దేశం టైటిల్ గెలిచింది. 2011లో మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వగా.. ఎంఎస్ ధోనీ సారథ్యంలోని టీమిండియా ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్లో శ్రీలంకను చిత్తుచేసిన భారత్.. రెండోసారి వన్డే ప్రపంచకప్‌ను అందుకుంది.
2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు సంయుక్తంగా ప్రపంచకప్‌కు ఆతిథ్యమిచ్చాయి. ఫైనల్ పోరు కూడా ఈ రెండు జట్ల మధ్యే జరిగింది. అయితే ఫైనల్ ఎక్కడ జరిగిందో.. ఆ జట్టే విజేతగా నిలిచింది. 2015లో ప్రపంచకప్ ఫైనల్ మెల్‌బోర్న్‌లో జరగ్గా.. ఆసీస్ విశ్వవిజేతగా నిలిచింది. 2019 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇవ్వగా.. ఆ జట్టే విశ్వవిజేతగా నిలిచింది. లార్డ్స్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ టైగా కాగా.. సూపర్ ఓవర్‌లో కూడా టైగా ముగిసింది. దాంతో బౌండరీ కౌంట్ ఆధారంగా ఇంగ్లండ్ విజేతగా నిలిచింది.
ఇప్పుడు ప్రపంచకప్ 2023కి భారత్ ఆతిథ్యం ఇస్తుండగా.. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా టైటిల్ గెలుస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. టీమిండియా తన జోరు కొనసాగిస్తూ.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ కప్ అందుకుంటుందని ఫాన్స్ ఆశిస్తున్నారు. రోహిత్ సేన జోరు చూస్తే.. ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. ఇక 1975లో వన్డే ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం కాగా.. మొదటి మూడుసార్లు ఇంగ్లండ్ ఆతిథ్యం ఇచ్చింది. అయితే ఆతిథ్య జట్టు టైటిల్ మాత్రం గెలవలేదు. ఎట్టకేలకు 2019 కప్ సాధించింది.