Rajasthan Woman Gave Birth For Triplets : ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు మగ పిల్లలకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు. రాజస్థాన్ లోని దుంగార్పూర్ జిల్లాలోని పిండావల్ గ్రామానికి చెందిన జయంతీలాల్ బదూదేవి దంపతులకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. మగపిల్లాడు కావాలని పరితపించిపోయారు. ఈసారైనా బాబు పుట్టాలని కనిపించిన దేవుళ్లందరికీ మొక్కుకున్నారు. ఎట్టకేలకు వారికి ఫలితం లభించింది. ఇటీవల గర్భం దాల్చిన బదూదేవి గత నెల 25న సగ్వారాలోని పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రిలో చేరింది. అయితే, నెలలు పూర్తిగా నిండకుండానే ఆ తర్వాతి రోజే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది.
Read Also: Naatu Naatu Song Shortlisted For Oscar Awards: ఆస్కార్ షార్ట్ లిస్టులో ట్రిపుల్ఆర్ నాటు నాటు సాంగ్
ఒక్కొక్కరు కేజీ బరువు మాత్రమే ఉండడంతో శిశువులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు. దీంతో వైద్యులు వారికి కృత్రిమంగా ఆక్సిజన్ అందించి ప్రత్యేకంగా పర్యవేక్షించారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు కోలుకోవడంతో డిశ్చార్జ్ చేశారు. విషయం తెలిసిన చుట్టుపక్కల వారు పిల్లలను చూసేందుకు తరలివస్తున్నారు. బదూదేవికి ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని, కుమారుడు కావాలన్న కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఆమె గర్భవతి అయినట్టు బదూదేవికి చికిత్స అందించిన డాక్టర్ ఇస్మాయిల్ తెలిపారు. ఇప్పుడామెకు ఏకంగా ముగ్గురు మగ పిల్లలు జన్మించినట్టు చెప్పారు. ఇలాంటి కేసులు చాలా అరుదుగా ఉంటాయన్నారు.