పుణేలో ఓ హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. భర్త ప్రాణాలను కాపాడేందుకు భార్య తన కాలేయాన్ని దానం చేసింది. అయితే వైద్యులు చేసిన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలో దురదృష్టవశాత్తూ భార్యాభర్తలు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళ్తే, పుణేకు చెందిన ఓ వ్యక్తి కొంతకాలంగా తీవ్రమైన లివర్ సమస్యతో బాధపడుతూ ఉన్నాడు. వైద్యులు కాలేయ మార్పిడి మాత్రమే చివరి మార్గమని సూచించారు. ఈ పరిస్థితుల్లో తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భార్య ముందుకు వచ్చి భర్తకు కాలేయం దానం చేసింది. అవసరమైన పరీక్షలు పూర్తి కావడంతో ఇద్దరినీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స కోసం సిద్ధం చేశారు.
కానీ అనుకోని విధంగా, ఆపరేషన్ సమయంలో పరిస్థితి విషమించింది. ముందుగా కాలేయం దానం చేసిన భార్య ప్రాణాలు కోల్పోయింది. ఆ వెంటనే శస్త్రచికిత్స పొందుతున్న భర్త కూడా ప్రాణాలను కోల్పోవడంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ప్రాణం పణంగా పెట్టి భర్తను కాపాడాలనుకున్న భార్య చేసిన త్యాగం చివరికి ఇద్దరి మరణంతో ముగియడంతో ప్రతి ఒక్కరి కళ్లు చెమర్చాయి. బాపు కోమ్కర్ గా గుర్తించబడిన రోగికి, అతని భార్య కామిని తన కాలేయంలో కొంత భాగాన్ని దానం చేశారు. ఆగస్టు 15న ఆసుపత్రిలో శస్త్రచికిత్సలు చేయించుకున్నారు. మార్పిడి శస్త్రచికిత్స తర్వాత బాపు కోంకర్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన ఆగస్టు 17న మరణించారు.
Also Read:Kerala: లైంగిక వేధింపుల ఎఫెక్ట్.. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే రాహుల్ సస్పెండ్
కామినికి ఆగస్టు 21న ఇన్ఫెక్షన్ వచ్చి చికిత్స సమయంలో మరణించింది. వారి కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఈ మరణాలు జరిగాయని ఆరోపిస్తూ, దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రామాణిక వైద్య ప్రోటోకాల్స్ ప్రకారం శస్త్రచికిత్సలు జరిగాయని ఆసుపత్రి తెలిపింది. శస్త్రచికిత్స ప్రమాదాల గురించి కుటుంబానికి, దాతకు ముందుగానే పూర్తిగా కౌన్సెలింగ్ అందించామని ఆసుపత్రి తెలిపింది. దర్యాప్తులో మేము పూర్తిగా సహకరిస్తున్నాము అని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర ఆరోగ్య శాఖ పూణేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి నోటీసు జారీ చేసిందని ఒక అధికారి తెలిపారు. మార్పిడి ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలను సమర్పించాలని సహ్యాద్రి ఆసుపత్రిని ఆదేశించినట్లు ఆరోగ్య సేవల డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నాగనాథ్ యెంపల్లె తెలిపారు.