Maduro wife: వెనుజులా అధ్యక్షుడు మడురో, అతడి భార్యను అమెరికా బంధించిన విషయం తెలిసిందే. ప్రపంచం మొత్తం ఈ అంశంపై విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మడురో భార్య ఏం పాపం చేసింది? యూస్ ఆమెను ఎందుకు బంధించింది? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మడురో భార్య సిలియా ఫ్లోరెస్ పరిస్థితి ఇప్పుడు కీలకంగా మారింది. న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. 2020లో నికోలాస్ మడురోపై అమెరికా నమోదు చేసిన కేసులో ఆమె పేరు లేదు. అయినా అమెరికా దాడిలో మడురోతో పాటు ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఆమెను అమెరికాకు తీసుకెళ్లి విచారించనున్నారు. అయితే.. సిలియా ఫ్లోరెస్‌పైన కూడా కేసులు నమోదు చేసినట్లు అటార్నీ జనరల్ పామ్ బాండి తాజాగా ప్రకటించారు. శనివారం కోర్టు కొత్తగా దాఖలైన అభియోగ పత్రాన్ని బయటపెట్టింది. అందులో ఆమెను కూడా నిందితురాలిగా చేర్చారు. ఆ కేసు తేదీని మాత్రం గోప్యంగా ఉంచారు. ఆ అభియోగ పత్రాన్ని సమర్పించిన యూఎస్ అటార్నీ జే క్లేటన్ గత ఏడాది పదవిలోకి వచ్చారు.
READ MORE: Dhurandhar : రణ్‌వీర్ ‘ధురంధర్’కు సౌత్ స్టార్ ఫిదా..
మడురో, ఆయన భార్యను ఎలా పట్టుకున్నారు అన్న విషయం అమెరికా కోర్టులు పట్టించుకుంటాయా? అన్నది మరో ప్రశ్న. పట్టించుకోదనే సమాధానం ఎక్కువగా వినిపిస్తోంది. మడురో తన అరెస్ట్ ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు విరుద్ధమని వాదించినా, అమెరికా కోర్టులకు ఆయనపై విచారణ చేసే అధికారం ఉందని చట్టం చెబుతోంది. గతంలో కూడా ఇలాంటి కేసులు వచ్చాయి. 1886, 1952, 1992లో జరిగిన కేసుల్లో ఇతర దేశాల నుంచి తీసుకొచ్చిన నిందితులు తామకు అక్రమంగా కోర్టు ముందుకు తీసుకొచ్చారని వాదించారు. కానీ కోర్టులు ఆ వాదనలను తోసిపుచ్చాయి. కోర్టు పరిధిలో నిందితుడు ఉన్నాడా లేదా అన్నదే ముఖ్యం, ఎలా తీసుకొచ్చారన్నది ముఖ్యం కాదన్నదే న్యాయసూత్రమని తెలిపాయి.
అయితే మడురోకు దేశాధ్యక్షుడిగా రక్షణ హక్కు ఉందా అనే అంశం చాలా క్లిష్టమైనది. అంతర్జాతీయ చట్టం ప్రకారం, ఇతర దేశాల కోర్టుల్లో దేశాధ్యక్షులను అరెస్ట్ చేయరాదు. అమెరికా సుప్రీంకోర్టు కూడా 1812లోనే ఈ సూత్రాన్ని గుర్తించింది. విదేశీ దేశాధిపతిని మరో దేశంలో అరెస్ట్ చేయడం సరికాదని అప్పట్లో చెప్పింది. అయితే మడురోకు ఈ రక్షణ వర్తిస్తుందా లేదా అన్నది, ఆయన నిజంగా వెనిజువెలా చట్టబద్ధ అధ్యక్షుడా కాదా అన్నదానిపై ఆధారపడి ఉంటుంది. ఆ నిర్ణయం ఎవరు తీసుకుంటారు అన్నదీ కీలకమే. ఇంతకీ ఏం జరుగుతుందో తేలాలంటే కోర్టు తీర్పు రావాల్సిందే.