Medchal Malkajgiri: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో రహస్యంగా మూగజీవాల నుంచి రక్తం సేకరిస్తున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. నాగారం సత్యనారాయణ కాలనీలో పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ అక్రమ దందాను బయటపెట్టారు. మేకలు, గొర్రెల నుంచి అనధికారికంగా రక్తం సేకరించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠాను పట్టుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో ఓ మటన్ షాప్ యజమాని, నకిలీ వెటర్నరీ డాక్టర్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
READ MOPRE: JanaNayaganTrailer : జననాయగన్ రీమెక్ కాదన్నారు.. కానీ భగవంత్ కేసరిని కాపీ పేస్ట్ చేశారు..
పోలీసుల తనిఖీల్లో మొత్తం 180 రక్తం ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సేకరించిన ఈ రక్తం, ప్లేట్‌లెట్లను కొన్ని వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తామని చెప్పుతూ అక్రమంగా విక్రయిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. అయితే సరైన వైద్య పర్యవేక్షణ లేకుండా, అడ్డగోలుగా మేకలు, గొర్రెల నుంచి రక్తం తీసుకోవడం వల్ల అవి ఒకటి లేదా రెండు రోజుల్లోనే మృతి చెందుతున్నాయని పోలీసులు తెలిపారు. మూగజీవాలపై ఇలాంటి క్రూరమైన చర్యలు పూర్తిగా చట్ట విరుద్ధమని, జంతు సంక్షేమ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఈ దందాకు సంబంధించి మరెవరైనా ఉన్నారా అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని, అక్రమ రక్త సేకరణపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు అధికారులు వెల్లడించారు.