Yevgeny Prigozhin: ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఇన్నిరోజులు రష్యా తరపున పోరాడిన సైన్యమే ఇప్పుడు ఎదురు తిరిగింది. రష్యా సైనిక నాయకత్వమే లక్ష్యంగా వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు చేస్తోంది. సాయుధ పోరాటానికి వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ పిలుపునిచ్చారు. రష్యా మిలిటరీ నాయకత్వాన్నే కూల్చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే రొస్తోవ్ మిలిటరీ కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా అసలు ఈ యెవ్జెనీ ప్రిగోజిన్ ఎవరు?.. పుతిన్‌కు ఆయనకు ఉన్న సంబంధం ఏమిటి? అనేది చర్చనీయాంశమయింది. నెటిజన్లు పెద్ద ఎత్తున గూగుల్‌లో అతని గురించి సెర్చ్ చేస్తున్నారు.
రష్యా పాలనలో ఒలిగార్క్‌లకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. రష్యాలో ధనిక వర్గంగా ఉన్న వీరు ఖనిజాలు, ఇంధనం వంటి వాటిని నియంత్రిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఫుడ్ కాంట్రాక్టులు ప్రధానంగా ఉన్న యెవ్జెనీ ప్రిగోజిన్ ఏకంగా రష్యానే భయపెడుతున్నాడు. ఫుడ్ కాంట్రాక్టులే కాదు అతని కనుసన్నల్లో ఓ పుతిన్ ప్రైవేట్ ఆర్మీ ‘వాగ్నర్ గ్రూప్’ పనిచేస్తుంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా సైనికులకు చేతకానీ పనిని, బఖ్‌ముత్ పట్టణాన్ని ఆక్రమించుకుని తన సత్తా ఏంటో చూపింది వాగ్నర్ గ్రూప్. ఇప్పుడు అలాంటి గ్రూప్ ఏకంగా సర్వశక్తివంతుడైన పుతిన్‌ను సవాల్ చేస్తోంది.
Also Read: RBI కోట్ల రూపాయల జరిమానా.. ఈ 3 బ్యాంకుల్లో మీకు ఖాతా ఉందా?
ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధం మొదలైనప్పటి నుంచి వాగ్నర్ కిరాయి సైన్యం రష్యాకు మద్దతుగా రంగంలోకి దిగింది. వాగ్నర్ గ్రూప్ అధినేత యెవ్జెనీ ప్రిగోజిన్. ముందు దొంగ.. తర్వాత చెఫ్.. ఆ తర్వాత ఏకంగా ఓ ప్రైవేటు సైన్యాన్ని నడిపే వ్యక్తిగా ఎదిగారు. పుతిన్ పొలిటికల్ సర్కిల్‌లో యెవ్జెనీ ప్రిగోజిన్ అంటే తెలియని వారుండరు. ఆయన్ను ‘పుతిన్ చెఫ్’గా వ్యవహరిస్తుంటారు. పుతిన్ ఆంతరంగికుల్లో ప్రిగోజిన్ ఒకరు. 1961లో జన్మించిన ప్రిగోజిన్.. 1980ల్లో దొంగతనం, దోపిడీ కేసుల్లో దాదాపు 9 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు. 1990ల్లో పుతిన్, ప్రిగోజిన్‌కు పరిచయం ఏర్పడింది. వీరిద్దరిదీ సెయింట్ పీటర్స్‌బర్గ్‌నే కావడం గమనార్హం. 2000లో పుతిన్ రష్యా అధ్యక్షుడు అయ్యారు. మరోవైపు ప్రిగోజిన్ రెస్టారెంట్లు ఇతర వ్యాపారాలను విస్తరించాడు. 2001 నుంచి పుతిన్ సన్నిహిత వర్గాల్లో ప్రిగోజిన్ కనిపిస్తూనే ఉన్నాడు. రష్యా ప్రభుత్వానికి చెందిన సైనిక, పాఠశాల ఫుడ్ కాంట్రాక్టులు ఇతనికే దక్కాయి. ఆ తర్వాత 2014లో వాగ్నర్ ప్రైవేట్ మిలిటరీ కంపెనీ (పీఎంసీ) నిర్వహణలో ప్రిగోజిన్ పాత్ర బయటకు వచ్చింది. క్రిమియా ఆక్రమణలో ‘లిటిల్ గ్రీన్‌మ్యాన్’ రూపంలో వాగ్నర్ గ్రూప్ హస్తం కూడా ఉంది. 2016లో ప్రిగోజిన్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. ఎఫ్‌బీఐ ఇతడిపై 2,50,000 డాలర్ల రివార్డు ప్రకటించింది.
వాగ్నర్ పీఎంసీ రష్యా ప్రైవేటు సైన్యం. వాస్తవానికి ఈ పేరుతో ఏ కంపెనీ రిజిస్టరై లేదు. రష్యా సైన్యానికి చెందిన మాజీ లెఫ్టినెంట్ కర్నల్ దిమిత్రి ఉత్కిన్ ప్రారంభించాడు. జర్మనీ నియంతకు ఇష్టమైన ఒపేరా కంపోజర్ వాగ్నర్ పేరిట దీనిని ప్రారంభించినట్లు చెబుతారు. వాగ్నర్ బృందంలో అత్యధికంగా మాజీ సైనికులే ఉంటారు. వీరికి కొన్ని సందర్భాల్లో సాధారణ రష్యా సైనికుడి కంటే చెల్లింపులు ఎక్కువగా ఉంటాయి. వీరు మరణిస్తే కుటుంబానికి దాదాపు 50 వేల డాలర్ల వరకు చెల్లిస్తారు. 2017లో బ్లూమ్‌బెర్గ్ లెక్క ప్రకారం ఈ గ్రూపులో 6,000 మంది ఉన్నారు. ప్రపంచంలోని పలు దేశాల్లో వాగ్నర్ గ్రూప్ కదలికలు ఉన్నాయి. లిబియా సివిల్ వార్, సిరియా, మోజాంబిక్, మాలి, సుడాన్, ది సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, వెనుజువెలా వంటి దేశాల్లో వాగ్నర్ గ్రూప్ ఉంది. ముఖ్యంగా సిరియాలో రష్యా అనుకూల బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కాపాడటంలో వాగ్నర్ గ్రూప్.. రష్యా సైన్యంతో కలిసి పనిచేసింది. మొన్నటిదాకా ఉక్రెయిన్‌లోనూ రష్యాకు అండగా వాగ్నర్ గ్రూప్ పోరాడింది. కానీ ఇప్పుడు రష్యాకు వ్యతిరేకంగా ముందుకు సాగుతోది. దీంతో రష్యాలో అంతర్యుద్ధం తప్పదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: Boys Marriage: పెళ్లి చేసుకున్న ఇద్దరు అబ్బాయిలు..!
వాస్తవానికి రష్యా చట్టాల ప్రకారం ప్రైవేటు సైన్యం నిర్వహించడం నేరం. కానీ, వాగ్నర్ గ్రూప్‌తో అనేక రకాలుగా రష్యాకు లాభం ఉంది. సైనిక శిక్షణ పొందిన కిరాయి మనుషులు లభిస్తారు. దీంతోపాటు విదేశాల్లో లక్ష్యాలను సాధించేందుకు నేరుగా రష్యా యూనిఫామ్‌లోని మనుషులను పంపాల్సిన పనిలేదు. ఆదే సమయంలో తమకు సంబంధంలేదని తప్పించుకొని.. విదేశీ సంబంధాలను కాపాడుకోవచ్చు. మరోవైపు.. ఎప్పుడంటే అప్పుడు వాగ్నర్ గ్రూప్‌ను రష్యా దళాలు అణిచివేసే అవకాశం ఉంది. ఈ గ్రూప్ చేసిన నేరాలను రష్యాపై రుద్దకుండా ముందు జాగ్రత్తగా ఈ ఏర్పాటు చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో వాగ్నర్‌పై పుతిన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. రష్యా ఉక్రెయిన్ చేతిలో దారుణంగా ఎదురుదెబ్బలు తింటున్న వేళ.. ప్రిగోజిన్‌కు చెందిన ‘వాగ్నర్ కిరాయి సైన్యం’ రంగంలోకి దిగింది. రష్యా జైళ్లను చుట్టేస్తూ.. క్షమాభిక్ష ప్రసాదిస్తామని చెబుతూ ఖైదీలతో అవసరమైన సిబ్బందిని ప్రిగోజిన్ భర్తీ చేశాడు. ఇలా దాదాపు 50 వేల మందిని నియమించాడు. ఉక్రెయిన్‌లోని బఖ్‌ముత్‌లో కీవ్ సైనికుల నుంచి వాగ్నర్‌కు తీవ్ర ప్రతిఘటన ఎదురైన సమయంలో.. రష్యా సైన్యం తమకు ఆయుధాలు ఇవ్వడం లేదంటూ ప్రిగోజిన్ ఆరోపణలు చేశారు. రష్యా రక్షణ మంత్రి, ఇతర ఉన్నతాధికారుల నిర్లక్ష్యం వల్ల వేల సంఖ్యలో సిబ్బందిని కోల్పోయినట్లు ప్రిగోజిన్ అనేక సార్లు తెలిపారు. ఈ క్రమంలో రష్యా సైనిక నాయకత్వంపై తిరుగుబాటు ప్రకటించి వార్తల్లో నిలిచారు వాగ్నర్ గ్రూప్ చీఫ్ ప్రిగోజిన్.