స్కిల్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు రిమాండ్ 44వ రోజుకు చేరింది. గత నెల 9న అరెస్టైన చంద్రబాబు రిమాండ్ నవంబర్ 1 వరకు కొనసాగనుంది. సెలవు దినాలు కావడంతో మూడు రోజులు ములాఖత్‌లు నిలిపివేయబడ్డాయి.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. నేటి సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం. ఈ వాయుగుండం ప్రభావంతో వచ్చే మూడు రోజులు కోస్తాలో వర్షాలు పడే అవకాశం ఉంది.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు స్వర్ణ రథంపై మలయప్పస్వామి విహరించనున్నారు. గోవింద నామస్మరణతో తిరుమల గిరులు మార్మోగిపోతున్నాయి. రాత్రి 7 గంటలకు అశ్వవాహనంపై శ్రీవారు దర్శనమిస్తారు.
ఇంద్రకీలాద్రిపై 8వ రోజు దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు అమ్మవారు దుర్గాదేవిగా దర్శనం ఇస్తున్నారు. తెల్లవారుజాము 2 గంటల నుంచీ దర్శనం ప్రాంభమైంది. క్యూలైన్లలో వేలాదిగా భక్తులు ఉన్నారు. దుర్గే దుర్గతి నాశని అన్న విధంగా అమ్మవారిని ఈరోజు దర్శించుకున్న వారికి దుర్గతుల నుంచి దూరం చేస్తారని ప్రతీతి ఉంది.
Also Read: Gold Price Today: పండగల వేళ పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?
విశాఖ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 8వ రోజు మహాకాళి అవతారంలో రాజశ్యామల అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. 7.30 గంటలకు మహాకాళి అవతారానికి హారతులు, దేవతామూర్తుల ఆలయాల సందర్శన ఉంది. 7.50 గంటలకు అమ్మవారి నిజరూపానికి విశేష అభిషేకం జరగనుంది. 9.00 గంటల నుంచి లోక కళ్యాణార్ధం రాజశ్యామల యాగం ఆరంభం అవుతుంది.
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నేడు న్యూజిలాండ్, భారత్ తలపడనున్నాయి. నాలుగుకు నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన ఈ రెండు జట్లు సమవుజ్జీల్లా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తొలి ఓటమిని రుచి చూసేదెవరు అని క్రికెట్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ధర్మశాలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి మ్యాచ్ ఆరంభం కానుంది.