గ్రూప్-3 పరీక్షలకు టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. నేడు, రేపు జరిగే గ్రూప్-3 పరీక్షల కోసం సెంటర్ల వద్ద కఠిన చర్యలను చేపట్టింది. అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ తీసుకురావాలని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచన చేసింది. హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఒరిజినల్ ఐడీ(పాన్ కార్డ్, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్)లను చూపించాల్సి ఉంటుంది. పరీక్ష సమయానికి అరగంట ముందే గేట్లు మూసివేస్తామని కమిషన్ ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా 5.36 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
మహారాష్ట్రలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. నేడు కూడా ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ పాల్గొననున్నారు. శనివారం చంద్రపూర్ జిల్లా గుగస్, రాజురా, డిగ్రాస్, వార్ధా ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల సభల్లో కాంగ్రెస్ తరఫున స్టార్ క్యాంపెయినర్ హోదాలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు నారా రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఆదివారం ఉదయం రామ్మూర్తినాయుడు భౌతికకాయాన్ని ప్రత్యేక విమానంలో నారావారిపల్లెకు తరలిస్తారు.
నేడు భక్తి టీవీ ‘కోటి దీపోత్సవం’లో 9వ రోజు జరగనుంది. సాయంత్రం 5.30 గంటలకు ఎన్టీఆర్ స్టేడియంలో కార్తీక దీపారాధన ఉంటుంది. నేటి కోటి దీపోత్సవంలో విశేష కార్యక్రమాలు ఉన్నాయి.
నేడు సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో మంత్రి దామోదర రాజనర్సింహ పర్యటించనున్నారు. జోగిపేటలో సాయంత్రం ప్రజా పాలన విజయోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొంటారు.
ఇవాళ శ్రీవారి ఆలయంలో కార్తీక వనభోజన మహోత్సవం జరగనుంది. వైభోత్సవ మండపంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజన ఉంటుంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.