శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ60ని ప్రయోగించడానికి శాస్త్రవేత్తలు ఏర్పాట్లు చేశారు. ఆదివారం రాత్రి 8:58 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభం కాగా.. సోమవారం రాత్రి 9:58 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లనుంది.
ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్ బోర్డు మీటింట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొననున్నారు. నూతన పరిశ్రమలు, పెట్టుబడులపై చర్చ జరగనుంది.
రేషన్ బియ్యం మాయం కేసులో నేడు మాజీ మంత్రి పేర్ని నాని భార్య జయసుధ ముందస్తు బెయిల్ పై న్యాయస్థానం తీర్పు ఇవ్వనుంది. రేషన్ బియ్యం మాయం కేసులో జయసుధ ఏ1గా ఉన్నారు.
నేడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి నివాళులర్పించే ఎజెండాతో సోమవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టి, దేశానికి మన్మోహన్ సింగ్ చేసిన సేవలను, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన పాత్రను వివరిస్తూ ప్రసంగిస్తారు.
ఈరోజు సాయంత్రం 4 గంటలకు పంచాయితీ రాజ్ అధికారులు, ఉద్యోగులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ సమావేశం కానున్నారు. ఇటీవల ఎంపీడీఓపై జరిగిన దాడి నేపథ్యంలో డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వరిస్తున్నారు.
నేటి నుంచి శ్రీవారి ఆలయంలో అధ్యాయనోత్సవాలు ఆరంభం కానున్నాయి. డిసెంబరు 30 నుంచి 2025 జనవరి 23వ తేదీ వరకు.. 25 రోజుల పాటు తిరుమల ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. 25 రోజుల పాటు ఆళ్వార్ దివ్యప్రబంధంలోని 4 వేల పాశురాలను శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శ్రీవైష్ణవులు పారాయణం చేస్తారు.
నేటి నుంచి శబరిమల ఆలయం మళ్లీ తెరచుకోనుంది. మకర విళక్కు పూజల కోసం సాయంత్రం 5 గంటలకు శబరిమల ఆలయాన్ని తెరవనున్నారు. సాయంత్రం 4 గంటలకు సాంప్రదాయ పూజలు జరగనున్నాయి.
ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య బాక్సింగ్ డే టెస్టు మెల్‌బోర్న్ వేదికగా జరుగుతోంది. ఐదో రోజు ఆట కొనసాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ 234 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ముందు 340 పరుగుల లక్ష్యం ఉంది.