గుంటూరు: రాజకీయాల నుంచి గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తప్పుకున్నారు. 2024 ఎన్నికల్లో పోటీ చేయట్లేదని ఆయన ప్రకటించారు. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో తప్పుకుంటున్నట్లు జయదేవ్ వెల్లడించారు. తాజాగా ఇదే అంశంపై తల్లి గల్లా అరుణకుమారి స్పందించారు. పార్లమెంట్‌ను గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల శాసించే వారని తెలిపారు. నీతి, నియమాలతో పెరిగిన కుటుంబం తమదని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్‌లో సీటు కోసం ప్రయత్నం చేస్తే రాలేదని.. అప్పుడు టీడీపీలో జాయిన్ అయినట్లు గుర్తుచేశారు. కేవలం జయదేవ్ కోసమే తామంతా తెలుగుదేశంలో చేరాల్సి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు తామంతా వైసీపీలో చేరుతున్నామంటూ మీడియాలో గగ్గోలు పెడుతున్నారని.. తాము ఏ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. కేవలం రాజకీయ విరామం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అరుణకుమారి చెప్పుకొచ్చారు.
Read Also: YCP-TDP Rebel MLA’s: రేపు స్పీకర్ ముందుకు అనర్హత పిటిషన్లు.. వారి హాజరు పై ఉత్కంఠ..!
ఎంపీ రామ్మోహన్ నాయుడు..
జయదేవ్ రాజకీయాల నుంచి విరామం తీసుకోవటం బాధగా ఉందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. జయదేవ్ ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారని గుర్తుచేశారు. అంతేకాకుండా పార్లమెంట్‌లో మాట్లాడేందుకు భయపడుతున్నప్పుడు తనను ఎంతగానో ప్రోత్సహించారని జ్ఞాపకం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో విషయాలపై జయదేవ్‌తో కలిసి పార్లమెంట్‌లో పోరాటం చేశామన్నారు. ఇక ప్రత్యేక హోదా కోసమైతే జయదేవ్ ఎంతో గొప్పగా లోక్‌సభలో గళమెత్తినట్లు గుర్తుచేశారు. కేవలం రాజకీయ విరామం మాత్రమే ప్రకటించారని.. ప్రజలకు మాత్రం దూరం ఉండరని చెప్పారు. త్వరలోనే జయదేవ్ తిరిగి రాజకీయాల్లో వస్తారని ఆశిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు.