ఏపీలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఏపీలో కాపు సామాజిక వర్గం రాజకీయ భవిష్యత్తు చుట్టూ వాతావరణం వేడెక్కు తోంది. పవన్ కళ్యాణ్ టీడీపీకి పెద్ద కార్యకర్తగా మారారని , కాపులను తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన విమర్శలు జనసేనకు సూటిగా తగిలాయి. మరోవైపు., కాపు నేత చేగొండి హరిరామజోగయ్య ఘాటుగా స్పందించారు. అమర్నాథ్…. “ఓ బచ్చా” సాధారణ మంత్రిపదవికి అమ్ముడిపోయారు అంటూ లేఖ సంధిస్తే……మీ మానశిక ధృఢత్వం పట్ల అనుమానం కలుగుతుందని ఘాటైన కౌంటర్ ఇచ్చారు మంత్రి.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి కాపుల చుట్టూ తిరుగుతున్నాయి. టీడీపీ,జనసేన పొత్తులపై విస్త్రతంగా ప్రచారం జరుగుతున్న వేళ అధికారపార్టీ దూకుడు పెంచింది. రాజకీయ అవసరాల కోసం కాకుండా కాపుల విస్త్రత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలని కోరుతోంది. ఆ దిశగా రాజకీయ ప్రాతినిధ్యం వైసీపీ ప్రభుత్వంలోనే సాధ్యం అయ్యిందని అందుకు మంత్రులు, ఎమ్మెల్యేల సంఖ్యే నిదర్శనం అంటోంది అధికారపార్టీ. ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాపులను తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కొంత కాలంగా విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో దూకుడు మరింత పెంచారు ఏపీ ఐటీ, భారీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. శనివారం నాడు పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని వేపగుంటలో నిర్మించిన కృష్ణదేవరాయ కాపు సంక్షేమ భవన్ ను స్థానిక ఎమ్మెల్యే అదీప్ రాజ్ తో కలిసి ప్రారంభించారు.
మాజీ మంత్రి అవంతి, అధికార పార్టీకి చెందిన కాపు సామాజిక వర్గ మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకత్వం తరలి వచ్చింది. ఈ సభ వేదికపై నుంచి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా విరుచుకుపడ్డారు అమర్నాథ్. తెలుగుదేశం పార్టీకి పెద్ద కార్యకర్తగా మారారని., రాజకీయ భవిష్యత్ కోసం సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టేందుకు సిద్ధపడ్డారని కీలక వ్యాఖ్యలు చేశారు. కొడుకు రోడ్డునపడితే దత్తపుత్రుడు వెట్టిచాకిరీకి సిద్ధపడుతున్నాడని…..రాజకీయంగా పోరాడే ధైర్యం ఉంటే 175స్థానాలకు పోటీ చెయ్యాలని సవాల్ విసిరారు అమర్నాథ్. కాపు సంక్షేమ భవనం కోసం గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే తామే పూర్తి చేశామని….అన్ని విధాలుగా కాపులకు అండగా ఉన్నది, వుండబోయేది వైసీపీ తప్ప మరో పార్టీ కాదన్నారు ఎమ్మెల్యే అదీప్ రాజ్.
Read Also: Harish Rao: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్ ఉండబోతుంది
పవన్ కళ్యాణ్ లక్ష్యంగా మంత్రి అమర్నాథ్ సంధించిన వాగ్భాణం జనసేనకు సూటిగా తగిలింది. మరోవైపు, మాజీ ఎంపీ, కాపునేత చేగొండి హరిరామ జోగయ్య లేఖ రాయడంతో హీట్ మరింత పెరిగింది. అమర్నాథ్ ఓ బచ్చా…..సాధారణ మంత్రిపదవి కోసం అమ్ముడుపోయాడు….అంటూ ఘాటైన పదాలు ప్రయోగించారు చేగొండి. ఈ లెటర్ కు మంత్రి అమర్నాథ్ సూటిగానే స్పందించారు. కాపుల భవిష్యత్తుపై చంద్రబాబుతో జతకడుతున్న పవన్ కళ్యాణ్ కు రాయాల్సి న లేఖ నాకు పంపించారు అంటూ ప్రారంభించి….మీరు మానసికంగా ధృఢంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నానంటూ ముగించారు. ఈ లేఖ జనసైనికులకు పండు మీద కారం చల్లినట్టయింది. అమర్నాథ్ వ్యాఖ్యలు, లేఖలపై జనసేన నిరసనలకు దిగింది. జగన్మోహన్ రెడ్డికి అమర్నాథ్ బానిసగా మారారని….విజ్ఞత,విచక్షణ లేకుండా మాట్లాడుతున్న మంత్రిని ఉపేక్షించేది లేదని ఫైర్ అయింది.మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలపై జనసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. భీమిలీ నియోజకవర్గ కార్యాలయంలో వినూత్న నిరసన తెలిపారు జనసేన నేతలు. అమర్నాధ్ దిష్టి బొమ్మ కు నిమ్మకాయలు దండలు వేసి నిరసన తెలిపారు. హరి రామ జోగ్యయకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మొత్తంగా కాపుల రాజకీయ అవసరాలు, వాటిని నెరవేర్చే దిశ గా వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చొరవ, భవిష్యత్ పరిణామాలపై ఇప్పు డు ప్రధానంగా చర్చ జరుగుతోంది. అదే సమయంలో మంత్రి అమర్నాథ్ ను మరింత టార్గెట్ చెయాలనే కీలక నిర్ణయం జనసేన తీసుకుంది. ఈ నేపథ్యంలో డైలాగ్ వార్ మరింత రాటు దేలడం ఖాయంగానే కనిపిస్తోంది.
Read Also: American Airlines: దారుణం.. సాయం కోరిన పాపానికి సిబ్బంది పైశాచికం