Who Will Be India New Head Coach: టీ20 ప్రపంచకప్ 2024తో రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగుస్తుంది. దీంతో కొత్త హెడ్ కోచ్ కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. ద్రవిడ్ కొనసాగే అవకాశం లేని నేపథ్యంలో ప్రధాన కోచ్ ఎవరవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హెడ్ కోచ్ పదవికి దరఖాస్తు ప్రక్రియ మే 27న ముగుస్తుంది. రానున్న రోజుల్లో చాలా మంది రేసులోకి వస్తారు కానీ.. ప్రస్తుతానికైతే ఇద్దరు టీమిండియా మాజీ ప్లేయర్స్ కోచ్ రేసులో ముందున్నారు.
ఎన్‌సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్.. కొత్త కోచ్ రేసులో ముందువరుసలో ఉన్నారు. ఒకవేళ లక్ష్మణ్ దరఖాస్తు చేసుకుంటే.. కోచ్ పదవికి అతడికే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆటగాడిగా ఎంతో అనుభవమున్న లక్ష్మణ్.. గత మూడేళ్లుగా ఎన్‌సీఏ డైరెక్టర్‌గా ఉంటున్నాడు. ఇండియా-ఎ, అండర్-19 జట్లను నడిపిస్తున్నాడు. రాహుల్ ద్రవిడ్ గైర్హాజరీలో భారత సీనియర్ జట్టుకు కోచ్‌గా పని చేశాడు. లక్ష్మణ్ మార్గనిర్దేశనంలోని జట్టు అసియా క్రీడల్లో, ఆస్ట్రేలియాతో ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ల్లో ఆడింది. ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఐర్లాండ్ సిరీసుల్లోనూ భారత జట్టుకు మార్గనిర్దేశం చేశాడు. భారత ఆటగాళ్లతో మంచి అనుబంధం ఉండడం లక్ష్మణ్‌కు కలిసొచ్చే అంశం.
Also Read: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు సజీవదహనం..
మరోవైపు గౌతమ్ గంభీర్ పేరూ వినిపిస్తోంది. కెప్టెన్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్‌కు రెండు టైటిళ్లు అందించిన గంభీర్‌కు మంచి క్రికెటింగ్ బుర్ర ఉందని, వ్యూహ రచనలో దిట్ట అని పేరు. ప్రస్తుతం అతడు మెంటార్‌గా ఉన్న కోల్‌కతా అద్భుత ఆటతో ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. అంతకుముందు లక్నోను నడిపించిన అనుభవం ఉంది. అయితే బీసీసీఐ పెద్దలు అడగకున్నా సొంతంగా హెడ్ కోచ్ పదవి కోసం గౌతీ దరఖాస్తు చేసుకుంటాడా? లేదా? అన్నది ఆసక్తికరం. రోహిత్ శర్మతో అతడికి సత్సంబంధాలు ఉన్నా.. కింగ్ విరాట్ కోహ్లీతో విభేదాలు ప్రతిబంధకమే అని చెప్పాలి.