Mahavir Singh Phogat on Vinesh Phogat Verdict: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అనర్హత వేటును ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కేవలం 100 గ్రాముల బరువు ఎక్కువగా ఉండడంతో అనర్హతకు గురైంది. దీనిపై కాస్‌కు వినేశ్ అప్పీల్ చేయగా.. తీర్పును ఇప్పటికే మూడుసార్లు వాయిదా వేసింది. అయినా కూడా భారత అభిమానులు ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. తప్పకుండా వినేశ్‌కు న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు. తీర్పు వాయిదా పడినప్పటికీ.. మన ఆశలను మాత్రం వదులుకోబోమని వినేశ్ పెద్దనాన్న మహవీర్ ఫొగాట్ అంటున్నారు.
Also Read: Google Pixel Phones: యాపిల్ స్ట్రాటజీని ఫాలో అయిన గూగుల్.. పిక్సెల్ ఫోన్లపై భారీ డిస్కౌంట్!
తాజాగా మహవీర్ ఫొగాట్ ఓ జాతీయ ఛానల్‌తో మాట్లాడుతూ… ‘మేం కాస్ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాం. మేం మాత్రమే కాదు 140 కోట్ల భారతీయులు ఎదురుచూస్తున్నారు. తీర్పు ఆలస్యమవుతూ ఉన్నా.. నిర్ణయం మాత్రం మనకు అనుకూలంగా వస్తుందనే నమ్మకంతో ఉన్నాం. తప్పకుండా భారత్‌కు మరో పతకం చేరుతుంది. వినేశ్ ఫొగాట్ సెమీస్‌లో ఒలింపిక్ గోల్డ్ మెడల్ విజేతను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. ఆమె కనీసం రజతం అందుకోవడానికి అర్హురాలు. కేవలం 100 గ్రాముల తేడాతో అనర్హతకు గురైంది. ఇక ఇప్పుడు అంతా కాస్ చేతుల్లోనే ఉంది’ అని అన్నారు.