Anantapur Crime: ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్ వ్యవస్థపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో పాటు విపక్షాల నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తూనే ఉన్నారు.. ఇదే సమయంలో.. అక్కడక్కడ కొన్ని వాలంటీర్ల వ్యవహారాలు కలకలం రేపుతూనే ఉన్నాయి.. అత్యాచారాలు, హత్యలు, దొంగతనాలు.. ఇలా పలు రకాల కేసుల్లో వారు చిక్కుకుంటున్నారు. తాజాగా, ఓ వాలంటీర్ బాగోతం అనంతపురంలో తీవ్ర కలకలంగా మారింది.. ఓ బాలికపై కన్నేసిన వాలంటీర్.. ఆమెపై కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడినట్టుగా తెలుస్తుండగా.. దీంతో ఆమె గర్భం దాల్చింది. అయితే, ఈ వ్యవహారంపై కుటుంబ సభ్యులు బాలికను నిలదీయడంతో.. ఓ కానిస్టేబుల్ వల్లే తాను గర్భందాల్చానంటూ ట్విస్ట్ ఇచ్చింది.. ఇక, బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు.. ఆ కానిస్టేబుల్‌ను అరెస్టు చేశారు. కానీ, బాధితురాలు మేజిస్ట్రేట్ ముందు అసలు నిందితుడి పేరు చెప్పడంతో.. అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
అనంతపురంలో జులై 5వ తేదీన నమోదైన బాలికపై అత్యాచారం కేసులో ఇప్పుడు కొత్త కోణం బయటకు వచ్చింది.. తనపై అత్యాచారం చేసింది కానిస్టేబుల్ కాదు.. ఓ వాలంటీర్ అని బాధిత బాలిక మేజిస్ట్రేట్ ముందు తెలిపింది. దీంతో, పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అయితే, ఈ కేసులో బాలిక మొదట కానిస్టేబుల్ పేరు వెల్లడించడంతో.. అతడు దాదాపు 50 రోజుల నుంచి జైలులోనే మగ్గుతున్నాడు. గుత్తి మండలానికి చెందిన రమేష్.. పోలీసు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోన్న సమయంలో.. బాలిక అతడిపై ఆరోపణలు చేసింది.. రమేష్ భార్యకు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఉంది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
ఇంతకీ రమేష్ కుటుంబానికి.. ఆ బాలికకు లింక్ ఏంటి? అనే విషయాల్లోకి వెళ్తే.. భార్య, తను ఇద్దరూ ఉద్యోగస్తులే కావడంతో కూతురును చూసుకోవడానికి రమేష్ తన గ్రామం నుంచి ఓ బాలికను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు.. దాదాపు రెండు ఏళ్ల నుంచి ఆ బాలిక వారి ఇంట్లోనే ఉంటుంది.. రమేష్ దంపతులకు చెందిన ఇద్దరు పిల్లలను చూసుకుంటుంది.. అయితే, జులై 5వ తేదీన ఆమె కానిస్టేబుల్ పై టూ టౌన్ పోలీసుకు ఫిర్యాదు చేసింది. అతడు తనపై కొన్నాళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడని.. ఒక సారి అబార్షన్ కూడా చేయించాడని ఆరోపించింది.. దీంతో పోలీసులు రమేష్‌ని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. మరోవైపు.. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవల పోలీసులు బాధిత బాలికను మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు.. ఆ సమయంలో బాధితురాలు అసలు విషయం బయటపెట్టింది. తనపై వాలంటీర్ గా పని చేస్తున్న రాజశేఖర్ అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పుకొచ్చింది.. నిందితుడు కానిస్టేబుల్ నివాసానికి సమీపంలోనే ఉంటున్నాడు. అతడికి కూడా పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే నిందితుడు రాజశేఖర్.. ప్రేమిస్తున్నానంటూ బాధిత బాలికను ట్రాప్ చేశాడు.. రమేష్ దంపతులు ఇద్దరూ ఉద్యోగస్తులే కావడంతో.. వారి ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాధిత బాలికపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.. దీంతో బాధితురాలు గర్భవతి అయ్యింది. ఈ విషయం రెండ నెలల కిందట ఆమె కుటుంబ సభ్యులకు తెలియడం.. ఆమెను వారు గట్టిగా నిలదీయడంతో కానిస్టేబుల్ పై నెపం నెట్టింది.. ఆ తర్వాత అసలు వ్యవహారం వెలుగు చూసింది.