హన్మకొండ జిల్లా కమలాపూర్ ఉన్నత పాఠశాలలో హిందీ పరీక్ష పేపర్ బయటకు వచ్చిన సంఘటనలో ఇన్విజిలేటర్ సబియా మహదత్ ఎస్ఎ (మాథ్స్) ను ఉద్యోగం నుండి తొలగిస్తూ హన్మకొండ డీఈఓ ఇచ్చిన ఉత్తర్వులు నిలుపుదల చేయాలని, సమగ్ర విచారణ అనంతరమే చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసీ) డిమాండ్ చేసింది. ఏప్రిల్ 4వ తేదీన హన్మకొండ జిల్లా కమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు) రూమ్ నంబర్ 3 నుండి పదో తరగతి హిందీ పరీక్ష పేపర్ బయటకు వచ్చిన సంఘటనలో బాధ్యురాలిని చేస్తూ ఆ రూములో ఇన్విజిలేటర్ గా విధులు నిర్వహిస్తున్న యుపిఎస్ నేరెళ్ళ ఉపాధ్యాయిని సబియా మదాహత్ ను ఎటువంటి విచారణ లేకుండా సర్వీసు నుండి తొలగిస్తూ అదేరోజు హన్మకొండ డీఈఓ ఉత్తర్వులు ఇచ్చారు. పేపర్ లీకేజీ పేరిట ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేయటానికో లేక సంచలనం సృష్టించటానికో రాజకీయ కుట్ర కోణంలో ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు సాగుతున్నది. ఎవరి పాత్ర ఏమిటో విచారణలో తేలుతుంది. తల్లిదండ్రులు, విద్యార్థుల్లో గందరగోళం సృష్టించి, ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయటానికి ప్రయత్నించిన దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని యుయస్పీసీ డిమాండ్ చేస్తున్నది.
Also Read : Ambati Rambabu: బాబు వెళ్లమంటేనే వారాహి బ్యాచ్ ఢిల్లీ టూర్.. బీజేపీతో విడాకులా..? టీడీపీతోనా..?
అయితే గది నుండి పేపర్ బయటకు పోవటంలో ఇన్విజిలేటర్ ఏమరుపాటు కారణమైతే కావచ్చు కానీ ఉద్దేశ్యపూర్వకంగా నిందితులకు సహకరించినట్లు నిరూపణ కాలేదు. మొదటి పావుగంటలో ఓఎంఆర్ షీట్స్ చెక్ చేసి సంతకాలు పెడుతున్న క్రమంలో ఊహించని రీతిలో మైనర్ బాలుడు చెట్టెక్కి మొదటి అంతస్తుకు వచ్చి కిటికీ చాటునుండి పేపర్ ఫోటో తీసిన విషయం గమనించలేదు. ఈ విషయమై సమగ్ర విచారణ జరపకుండా, తీవ్రమైన దండన విధించే సందర్భంలో అనుసరించాల్సిన కనీస సిసిఎ నిబంధనలు పాటించకుండానే ఉపాధ్యాయురాలిని ఏకపక్షంగా ఉద్యోగం నుండి తొలగించటం ( రిమూవల్ ప్రమ్ సర్వీస్) సమంజసం కాదు. హన్మకొండ డిఈఓ చర్య రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తున్నది. ఎస్సెస్సీ విధులు నిర్వహించాలంటేనే ఉపాధ్యాయులు భయపడే పరిస్థితి నెలకొన్నది. విద్యాశాఖ కార్యదర్శి జోక్యం చేసుకుని డిఈఓ ఉత్తర్వులు నిలుపుదల చేసి, సమగ్ర విచారణ జరిపించిన అనంతరం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పక్షాన చావ రవి, వై అశోక్ కుమార్, టి లింగారెడ్డి విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
Also Read : Hair Cut: బార్బర్ చేసిన హెయిర్ కట్ నచ్చలేదని.. బాత్రూంలోకి వెళ్లి..