చాక్లెట్.. ఈ పేరు వినగానే చాలా మంది నోట్లో నీళ్లూరుతాయి. మనసు దాని వైపు పరుగులు తీస్తుంది.చాక్లెట్ రుచిలోనే కాదు. ఆరోగ్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఏదైనా అతిగా తింటే చెడే చేస్తుంది. అందుకే దాని ప్రయోజనాలను పొందాలంటే తగిన మోతాదులోనే తినాలి. లేదంటే స్థూలకాయం, హైపర్‌టెన్షన్, మధుమేహం వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. చాకెట్ల వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మెదడులో సెరటోనిన్ హార్మోన్ స్థాయులను పెంచి మనసులోని ఆందోళనలను తగ్గించడంలో చాక్లెట్ ఉపయోగపడుతుంది.
రోజుకు ఒకటి లేదా రెండు బైట్స్ తింటే దాని ప్రయోజనాలు పూర్తిగా అందుతాయి. చాకెట్ల వల్ల చర్మ సౌందర్యం కూడా మెరుగవుతుంది. చాక్లెట్‌లోని ఫ్లేవనాల్స్ అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. అలాగే చర్మానికి రక్తప్రసరణను మెరుగుపరిచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. చాక్లెట్‌లో ఉండే కొకోవాలో ఫినోలిక్ సమ్మేళనాలుంటాయి. అవి మన శరీరంలోని రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. చాక్లెట్ మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును తగ్గించడంలో సహకరిస్తుంది. అంతేకాదు గర్భిణిగా ఉన్నప్పుడు రోజూ 30 గ్రాముల చాక్లెట్ తీసుకోవడం వల్ల పిండం ఆరోగ్యంగా పెరుగుతుంది. హాట్ చాక్లెట్ మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా చాక్లెట్లు తినడం వల్ల జ్ఞాపకశక్తి కూడా మెరుగుపడుతుంది. వ్యాయామం చేసే ముందైనా, క్రీడల్లో పాల్గొనే ముందైనా తక్షణ శక్తి కోసం ఓ చిన్న ముక్క చాక్లెట్ తింటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే నార్మల్ చాక్లెట్ల కంటే డార్క్ చాక్లెట్లు తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే చాక్లెట్ ప్రయోజనాలు పొందాలంటే రోజుకు మితంగానే తినాలనే విషయాన్ని గుర్తుంచుకోండి.