వెన్నుపోటు దినోత్సవం కేవలం పనిలేక చేసినట్టు ఉందని.. కూటమి ప్రభుత్వం లో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేసిందన్నారు. ఏడాది కాలంలో పెన్షన్, అన్నక్యాటీన్, ఉచిత గ్యాస్ సిలిండర్, యువతకి డీఎస్సీ వంటి కార్యక్రమాలు చేసిందన్నారు. కేంద్రప్రభుత్వం సహకారంతో అమరావతి, పోలవరం, రైల్వే జోన్, స్టీల్ ప్లాంట్ వంటి అసలు జరగవు అనుకున్న కార్యక్రమాలు చేసి చూపించామని తెలిపారు. ప్రతిపక్షానికి ఆనాడే ప్రజలు వెన్ను విరిచారని.. అందుకే 11 సీట్లకు రాష్ట్ర ప్రజలు పరిమతం చేశారని విమర్శించారు.
చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ కలిసి ఒక బ్రాండ్ క్రియేట్ చేశారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కొనియాడారు. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఉపయోగపడే పని ఒక్కటి కూడా చెయ్యడం లేదని.. ఆ బ్రాండ్ వాల్యూ తియ్యడానికి వైసీపీ చూస్తోందన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్య ఉద్దేశం రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయడమే అని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ.. రాష్ట్రంలో ఎదో జరిగిపోతుందని ప్రజలు అనేకునేలా చేస్తున్నారన్నారు. ఇలానే కొనసాగిస్తే వైఎస్ఆర్సీసీకి రానున్న రోజుల్లో 11లో 10 తీసి ఒక్క సీటుకే పరిమితం చేస్తారని విమర్శించారు.