Kishan Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తన మంత్రివర్గ సహచరులతో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఇవాళ హైదరాబాద్ రాజ్ భవన్ ముందు ధర్నా చేయడం విడ్డూరంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారం గురివింద గింజ సామెతను తలపిస్తోందని.. అదానీ అంశంపై మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు. రూ.100 కోట్లు అదానీ కంపెనీ నుంచి సీఎస్‌ఆర్ ఫండ్స్ రూపంలో తీసుకుని ఒప్పందాలు తీసుకున్నారని.. ఎందుకోసం రూ. 100 కోట్ల సహాయం అడిగారో, ఎందుకు కలిసి ఫొటోలు దిగారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వందకోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటీకి ఖర్చు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నప్పుడు గుర్తులేదా అంటూ ప్రశ్నించారు.
Read Also: Harish Rao: ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ చేస్తున్నారు.. అదానీ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలి..
వందకోట్ల సహాయం ఎందుకు అడిగారు? ఎందుకు ఇస్తామన్నారు?.. ఇవన్నీ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీని సవాల్ చేస్తున్నా.. రేవంత్ అయినా రాహుల్ గాంధీ అయినా.. ఏ ప్రాతిపదికన అదానీ మీద చర్యలు తీసుకోవాలో చెప్పాలని ప్రశ్నించారు. ఒక సాక్ష్యం చూపిస్తారా అంటూ సవాల్ విసిరారు. మన మీడియా ముందు, న్యాయస్థానాల ముందు, ప్రజలముందు ఆధారాలు చూపించకుండా.. విమర్శలు చేయడం సరికాదన్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఇటీవల వివిధ రాష్ట్రాల ఎన్నికల్లో వరుసగా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న పార్టీ.. ఇవాళ ఫ్రస్టేషన్‌లో అదానీ మాట మాట్లాడుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం పొరపాటు చేసిందని, కేంద్రం అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిరూపించగలదా అంటూ ప్రశ్నలు గుప్పించారు. మాటమీద నిలబడే సత్తాలేక.. ఇవాళ విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిగా సరైన పాలన లేదని.. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి మీద విచారణ లేదని కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా అన్నిరకాల వైఫల్యంతో.. 12 ఏళ్లలో రావాల్సిన ప్రజావ్యతిరేకతను 12 నెలల్లోనే కూడగట్టుకున్నారన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీద, మోడీ మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ.. రేవంత్ రెడ్డి ధర్నా చేయడాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు.
Read Also: Youtuber Arrest: యూట్యూబర్ భానుచందర్ అరెస్ట్.. రిమాండ్‌కు తరలింపు
రేవంత్ రెడ్డి కేసీఆర్ వైపే ఉన్నారని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ దోస్తులేనంటూ కిషన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతే.. మళ్లీ బీఆర్ఎస్ పార్టీయే రావాలని కాంగ్రెస్ అధిష్టానం.. రేవంత్ రెడ్డిని హెచ్చరించిందా అంటూ కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు.అందుకే రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ పాట పాడుతున్నాడా అంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ బొమ్మ బొరుసు లాంటి వ్యక్తులు అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దొందూ దొందే అని.. ఈ రెండు పార్టీల పాలనకు తేడా లేదని అన్నారు. ప్రజలను వంచించడంలో తెలంగాణ సంపదను దోచుకోవడంలో, కుటుంబ పరిపాలన తీసుకురావడంలో, కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల విషయంలో.. ఆ రెండు పార్టీల పనిచేసే తీరు ఒక్కటేనన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను మూకుమ్మడిగా.. ప్రజాతీర్పును అగౌరవపరిచిన పార్టీలు నాడు బీఆర్ఎస్, నేడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేను పీఏసీ ఛైర్మన్‌గా, ఎంపీ అభ్యర్థిగా.. కాంగ్రెస్ నియమించడం కంటే బలమైన దోస్తీ ఉంటుందా అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా కేసీఆర్ మారిస్తే.. రేవంత్ రెడ్డి మరింత దిగజారుస్తున్నాడని వ్యాఖ్యానించారు. ఎవరు, ఎప్పుడు అప్పులిస్తరో తెలుసుకునేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిదంటూ విమర్శింటారు.