భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్‌లోని జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ పాలన పూర్తిగా భ్రష్టుపట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు దిక్కులేకుండా పోయిందని అన్నారు. ముఖ్యమంత్రి రబ్బర్ స్టాంప్ లా మారిపోయారని, రాష్ట్ర పాలనను జన్ పథ్, గాంధీభవన్ ద్వారా నడిపిస్తున్నారని మండిపడ్డారు. మంత్రివర్గంలో ఎవరు ఉండాలో కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయిస్తుందని పీసీసీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని, ముఖ్యమంత్రి అధికారాన్ని కాంగ్రెస్ హైకమాండ్ హస్తగతం చేసుకోవడం బాధాకరమన్నారు. తెలంగాణను దోచుకుని ఢిల్లీ పెద్దలకు కప్పం కడుతున్నారని ఆరోపించారు. పాలనపై సీఎంకు పట్టులేకపోవడానికి హెచ్‌సీయూ భూముల వ్యవహారమే ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అవినీతిపాలనను అంతం చేయాల్సిన సమయం వచ్చిందని తెలిపారు.
హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి మజ్లిస్ పార్టీకి ఓటేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్‌ను మజ్లిస్‌కు అప్పగించేందుకు ఈ రెండు పార్టీలు పోటీపడుతున్నాయని చెప్పారు. మజ్లిస్ పార్టీ దేశద్రోహ పార్టీ అయితే, బీజేపీ దేశభక్తి పార్టీ అని స్పష్టం చేశారు. ఈ ఎన్నికలు దేశద్రోహ పార్టీకి, దేశభక్తి పార్టీకి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణించారు. హైదరాబాద్ కార్పొరేటర్లు, ఓటర్లు ఎవరి పక్షాన నిలవాలో ఆలోచించాలని సూచించారు. బీజేపీ అభ్యర్థి గౌతంరావు గెలుస్తారనే నమ్మకం ఉందని తెలిపారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చాలా కాలం కిందటే కుమ్మక్కయ్యాయని బండి సంజయ్ అన్నారు. చెన్నైలో డీలిమిటేషన్ సమావేశానికి ఈ రెండు పార్టీలు కలిసి హాజరయ్యాయని గుర్తుచేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కూడా కలిసి ఓటేశాయని ఆరోపించారు.
45 ఏళ్లుగా బీజేపీ అనేక ఒడిదొడుకులు, అవమానాలను ఎదుర్కొంటూ ముందుకు వచ్చిన పార్టీ అని, వేలాది మంది కార్యకర్తల బలిదానాలు, లక్షలాది మంది పోరాటాలతో బీజేపీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. జాతీయ భావజాలం, సిద్ధాంత బలం వల్లే బీజేపీ ఈ స్థాయికి చేరిందని అన్నారు. 2019లోనే బీజేపీ 18 కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనే నంబర్ వన్ పార్టీగా నిలిచిందని చెప్పారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో స్వంతంగా, 6 రాష్ట్రాల్లో కూటమి ద్వారా బీజేపీ ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. వాజ్‌పేయి నేతృత్వంలో ప్రోక్రాన్ అణుపరీక్షలతో దేశ సత్తా చాటిందని, స్వర్ణ చతుర్భుజీ ప్రాజెక్ట్ ద్వారా జాతీయ రహదారులను విస్తరించిన ఘనత బీజేపీదేనని పేర్కొన్నారు. చిట్టచివరి వ్యక్తులకు సంక్షేమం అందించాలన్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలను బీజేపీ కొనసాగిస్తున్నదని చెప్పారు.
మోడీ పాలనలో దేశం ఆర్థిక ప్రగతిలో అద్భుత ఫలితాలు సాధించిందని, కేంద్ర సంక్షేమ పథకాలను తెలంగాణలో పూర్తిగా అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూస్తూ అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం మోడీదేనని తెలిపారు. రేషన్ షాపుల్లో ప్రజలకు అందిస్తున్న బియ్యం మోడీ బియ్యమేనని స్పష్టం చేశారు. కిలో బియ్యం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.37 ఖర్చు చేస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ‘సన్న బియ్యం’ పేరిట కేవలం రూ.10 ఖర్చు చేస్తుందని పేర్కొన్నారు. రూ.10కు కిలో బియ్యం ఎక్కడ వస్తుందో కాంగ్రెస్ నేతలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. ఈ నేపథ్యంలో రేషన్ షాపుల్లో ప్రధాని ఫోటో ఎందుకు పెట్టకూడదని ప్రశ్నించారు. వడ్ల కొనుగోలు నుంచి బియ్యం పంపిణీ వరకు ప్రతిపైసా కేంద్రమే వెచ్చిస్తోందని బండి సంజయ్ స్పష్టం చేశారు.