Union Minister Ashwini Vaishnaw: విజయనగరం జిల్లా కంటకాపల్లి దగ్గర జరిగిన రైల్వే ప్రమాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్.. మానవ తప్పిదం వల్లే కంటకాపల్లిలో ఘోర రైలు ప్రమాదం జరిగిందన్నారు.. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. ఇక, త్వరలో మరికొన్ని వందే భారత్ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయని తెలిపారు. వారానికి ఒక వందే భారత్ రైలు నిర్మాణం జరుగుతోంది.. రైల్వేలను రాజకీయాలతో ముడిపెట్టి చూడవొద్దుని సూచించారు. ఆంధ్రప్రదేశ్ లో రైల్వేల అభివృద్ధి కోసం 8 వేల 406 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం.. తూర్పు కోస్తా రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటుకు భూమి కేటాయింపే ప్రధాన సమస్యగా మారిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని భూమిని అప్పగిస్తే ఇవాళ్టి నుంచే పనులు ప్రారంభిస్తాం అని వెల్లడించారు. 52ఎకరాల భూమి అవసరం అవుతుందని గుర్తించాం.. డిజైన్లు, 106 కోట్ల రూపాయల నిధులు సిద్ధంగా ఉన్నాయి.. భూమి కేటాయింపు విషయంలో జాప్యం జరుగుతోంది.. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు.
Read Also: Naga Chaitanya: తండేల్ ప్రయాణం మొదలయ్యింది…
మరోవైపు, 5G సేవల విస్తరణ చాలా వేగంగా జరుగుతోందన్నారు అశ్వనీ వైష్ణవ్.. దీపావళి నాటికి బీఎస్ఎన్ ఎల్ 5G సేవల్లోకి వస్తుందని వెల్లడించారు. నాలుగు వేల నూతన సెల్ ఫోన్ టవర్లు ఏర్పాటు అవుతున్నాయి… అందులో ఎక్కువ ఉత్తరాంధ్రలోనే జరుగుతోందని పేర్కొన్నారు కేంద్రమంత్రి అశ్వనీ వైష్ణవ్. కాగా, విజయనగరం జిల్లా కంటకాపల్లిలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 13 మంది మృతి చెందిన విషయం విదితమే కాగా.. 40 మందికి పైగా తీవ్ర గాయాలు పాలయ్యారు. అయితే ఈ రైలు ప్రమాద దుర్ఘటన పై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుని విచారణ చేపట్టింది.