Undavalli Arun Kumar: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అష్ట దరిద్రాలకు కేంద్ర ప్రభుత్వమే కారణం అంటూ విమర్శలు గుప్పించారు సీనియర్ పొలిటీషియన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను ప్రస్తావించిన ఆయన.. కేంద్రానికి రాష్ట్రం నుంచి 100 రూపాయలు వెళ్తే.. వాళ్లు తిరిగి రాష్ట్రానికి ఇస్తున్నది 64 రూపాయలు మాత్రమేనని దుయ్యబట్టారు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని కోరుకోవటం మినహా నాలాంటి వారు ఏమీ చేయలేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, పోలవరం ప్రాజెక్టు పనులపై ప్రభుత్వం ఒక శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఉండవల్లి.. కేంద్ర ప్రభుత్వం.. కోటి 64 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసింది.. కానీ, కేంద్రంపై నోరు ఎత్తటానికి అధికార, ప్రతిపక్ష పార్టీలకు నోరు రావటం లేదని విమర్శించారు.
Read Also: Undavalli Arun Kumar: యూనిఫాం సివిల్ కోడ్‌పై ఉండవల్లి కీలక వ్యాఖ్యలు.. ఎవరి వైఖరి ఏంటి..?
ఇక, కాంగ్రెస్ మరింత బలపడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు ఉండవల్లి.. మరోవైపు వైఎస్ షర్మిల వస్తే కాంగ్రెస్ పార్టీకి బాగానే ఉంటుందన్నారు. బెంగుళూరులో ప్రతిపక్షాల సమావేశం వల్ల ప్రయోజనం ఉంటుంది.. కాంగ్రెస్‌కు బెంగుళూరుతో సెంటిమెంట్ ఉందన్నారు.. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్న ఆయన.. బీజేపీ నిర్ణయాలను అంచనా వేయలేం అన్నారు. ఇక, బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియామకంపై స్పందిస్తూ.. పురంధరేశ్వరి స్వతాహాగా మంచి స్వభావంతో ఉండే వ్యక్తి.. మార్పు మంచికే అని భావిస్తున్నాం అని పేర్కొన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.