UGC New Rules 2026: యూనివర్సిటీల్లో చదువుతున్న కొందరు విద్యార్థులు తమ కులం కారణంగా అవమానాలు, వివక్షను ఎదుర్కొన్న ఘటనలు దేశవ్యాప్తంగా చర్చకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదు అనే ఉద్దేశంతో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) కొత్త ఈక్విటీ నిబంధనలను తీసుకొచ్చింది. జనవరి 13న, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రెగ్యులేషన్స్ 2026ను విడుదల చేసింది. ఈ నిబంధనల ప్రకారం.. ప్రతి ఉన్నత విద్యా సంస్థలో తప్పనిసరిగా ఈక్వల్ అపర్చునిటీ సెంటర్ ఏర్పాటు చేయాలి. ఈ కేంద్రం ద్వారా వివక్షపై ఫిర్యాదులు తీసుకోవడం, సమస్యలు పరిష్కరించడం, విద్యార్థుల్లో సమానత్వ భావన పెంచడం వంటి పనులు ఈ సెంటర్ ద్వారా నిర్వహిస్తారు. అయితే.. నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నది కాదు. 2012లో తీసుకొచ్చిన వివక్ష నిరోధక నిబంధనల అమలుపై సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ వేసింది రోహిత్ వెములా, పాయల్ తడ్వి తల్లులు. రోహిత్ వెములా హైదరాబాద్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో 2016లో ఆత్మహత్య చేసుకున్నాడు. రోహిత్ కుల వివక్షకు గురయ్యాడన్న ఆరోపణలు అప్పట్లో దేశాన్ని కుదిపేశాయి. అలాగే 2019లో ముంబయిలోని నెయిర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న డాక్టర్ పాయల్ తడ్వి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమెపై సీనియర్లు కుల ఆధారంగా వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి ఘటనలే కొత్త నిబంధనలకు బలమైన కారణమయ్యాయి.
READ MORE: T20 world cup: టీ20 వరల్డ్ కప్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 5 బౌలర్లు.. లిస్ట్ లో ఎవరెవరున్నారంటే?
ఈ నిబంధనల్లో భాగంగా ఉన్నత విద్యా సంస్థలలో సమానత్వాన్ని ప్రోత్సహించడం, విద్యార్థులు ఏ వర్గానికి చెందినవారైనా సరే, వారికి వివక్ష ఎదురు కాకుండా చూడటమే లక్ష్యంగా పెట్టుకుంది. మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం, వైకల్యం ఆధారంగా విద్యార్థుల పట్ల వివక్ష చూపకుండా చూసుకోవడం, ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా బలహీన వర్గాలు, వికలాంగుల పట్ల వివక్షను తొలగించడం, ఉన్నత విద్యా సంస్థలలో సమానత్వాన్ని ప్రోత్సహించడం వంటి లక్ష్యాలను పెట్టుకున్నారు. కుల ఆధారిత వివక్ష నిర్వచనంలో ఇతర వెనుకబడిన తరగతులను చేర్చడం వివాదానికి దారి తీసింది. గతంలో విడుదల చేసిన ముసాయిదాలో కుల ఆధారిత వివక్షకు వ్యతిరేకంగా కల్పించే రక్షణ పరిధిలో ఎస్సీలు, ఎస్టీలు మాత్రమే ఉండేవారు. అయితే ఇప్పుడు అందులో ఓబీసీలను కూడా చేర్చడాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. ఇది జనరల్ కేటగిరీకి వ్యతిరేకమనేది వారి వాదన. దీనిని వ్యతిరేకిస్తున్నవారి అభిప్రాయం ప్రకారం ‘‘తాజా నియమావళి ప్రకారం జనరల్ కేటగిరీ విద్యార్థులపై తప్పుడు ఆరోపణలు చేయవచ్చు. దాని వల్ల వారి కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది’’ అని చెబుతున్నారు. ఈక్విటీ కమిటీలో జనరల్ కేటగిరీకి ప్రాతినిధ్యం లేదని వాదిస్తున్నారు. జనరల్ కేటగిరీ సభ్యుడు లేకపోవడం వల్ల దర్యాప్తు నిష్పాక్షికంగా జరగదనేది వారి వాదన.
ఈ నిబంధనలపై వ్యతిరేకత తీవ్రంగా మారింది. యూజీసీ కార్యాలయం ఎదుట “సవర్ణ సేన” అనే సంఘం ఆధ్వర్యంలో నిరసనలు జరిగాయి. జనరల్ కేటగిరీ విద్యార్థులకు ఈ నిబంధనల్లో స్పష్టమైన రక్షణ లేదని అంటున్నారు. తమపై వివక్ష జరిగితే ఎక్కడ ఫిర్యాదు చేయాలో చెప్పలేదని, ఈ నిబంధనల వల్ల రిజర్వుడ్ కేటగిరీల సభ్యుల నుంచి ఎక్కువ ఫిర్యాదులు రావచ్చని భయపడుతున్నారు. 2016–17లో యూనివర్సిటీల్లో కుల వివక్షపై దాదాపు 173 ఫిర్యాదులు నమోదు కాగా.. 2023–24 నాటికి అవి 350కు పైగా పెరిగాయని గణాంకాలను చెబుతున్నాయి. ఎలాంటి కారణం లేకుండా, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కొందరు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చెందిన వ్యక్తులు జనరల్ కేటగిరీకి చెందిన విద్యార్థులపై ఫిర్యాదులు చేస్తున్నారని వాదిస్తున్నారు. అకారణంగా జనరల్ కేటగిరీకి చెందిన విద్యార్థులు జైలు పాలవుతున్నారని, వారికి రక్షణ లేకుండా పోతుందని వాపోతున్నారు. ప్రస్తుతం కళాశాలల్లో దోస్తుల మధ్య కుల మత విభేదాలు ఉండవు. రాను రాను కులాలకు సంబంధించిన ముసుగు తొలగిపోతుంది. ఈ తరుణంలో మళ్లీ ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకురావడం, నిబంధనల పేరుతో జనరల్ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయడం తప్పని భావిస్తున్నారు.
మరోవైపు.. ఈ అంశంపై ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ (AISA) కూడా స్పందించింది. యూజీసీ నిబంధనలు ఒక్కసారిగా వచ్చినవి కావని, సంవత్సరాలుగా జరిగిన పోరాటాలు, వ్యవస్థల వైఫల్యాల ఫలితమని పేర్కొంది. కొత్తగా ఈక్విటీ కమిటీ ఏర్పాటు చేయడం, 24 గంటలూ పనిచేసే హెల్ప్‌లైన్, ఈక్విటీ స్క్వాడ్లు, ఈక్విటీ అంబాసిడర్లు వంటి అంశాలు ఇందులో ముఖ్యమని తెలిపింది. అయితే మరోవైపు, ఈ నిబంధనల్లో వివక్షను చాలా సాధారణంగా మాత్రమే వివరించారని, ఏ చర్యలు వివక్షగా పరిగణించాలి అనే స్పష్టత లేదని AISA విమర్శించింది. అలాగే ఈక్విటీ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళల ప్రాతినిధ్యం స్పష్టంగా లేదని చెప్పింది. ఈ అస్పష్టత వల్ల సంస్థలు తమకు అనుకూలంగా అర్థం చేసుకుని బాధ్యత నుంచి తప్పించుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. 2019 నుంచి 2024 మధ్య కుల వివక్షపై ఫిర్యాదులు 118 శాతం పెరగడం వ్యవస్థలో ఉన్న లోపాలను చూపుతోందని AISA అభిప్రాయపడింది. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ వివాదంపై స్పందించింది. జనరల్ కేటగిరీ విద్యార్థుల ఫిర్యాదులను పరిష్కరించేలా నిబంధనల్లో కొత్త సెక్షన్ చేర్చుతామని స్పష్టం చేసింది. ఎవరికీ అన్యాయం జరగకుండా అందరి సమస్యలకు పరిష్కారం దొరకాలన్నదే తమ లక్ష్యమని తెలిపింది. ఇదే సమయంలో బరేలీ నగర మేజిస్ట్రేట్ అలంకార్ అగ్నిహోత్రి రాజీనామా చేయడం చర్చకు దారి తీసింది. యూజీసీ ఈక్విటీ నిబంధనలు సహా కొన్ని ప్రభుత్వ విధానాలు కుల ఆధారిత ఉద్రిక్తతలను పెంచే ప్రమాదం ఉందని ఆయన తన రాజీనామాలో పేర్కొన్నారు. మొత్తానికి, ఈక్విటీ నిబంధనల కింద ప్రతి కాలేజీ, యూనివర్సిటీలో ఈక్వల్ అపర్చునిటీ సెంటర్ ఏర్పాటవుతుంది. ఈ కేంద్రం వివక్షపై చర్యలు తీసుకోవడం మాత్రమే కాదు, క్యాంపస్‌లో సమానత్వం, ఐక్యత పెంపొందించే బాధ్యతను తీసుకుంటుంది. అవసరమైతే స్థానిక అధికారులు, ఎన్‌జీవోలు, మీడియాతో కలిసి పనిచేస్తుంది. ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగులు, మహిళలు వంటి వర్గాలకు రక్షణ, మద్దతు కల్పించడమే దీని ఉద్దేశమని చెబుతున్నారు. ఈ నిబంధనలు సమానత్వం వైపు ఒక అడుగా? లేక కొత్త వివాదాలకు కారణమా? అన్నది కాలమే తేల్చాలి.